Supreme Court: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంలో మళ్లీ ప్రారంభమైన వాదనలు

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మళ్లీ ప్రారంభమైంది. చంద్రబాబు తరఫున హరీశ్‌ సాల్వే, సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు.

Updated : 10 Oct 2023 11:36 IST

దిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మళ్లీ ప్రారంభమైంది. చంద్రబాబు తరఫున హరీశ్‌ సాల్వే, సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు కొనసాగిస్తున్నారు. విచారణ విధానంపై ఇరుపక్షాల న్యాయవాదులు భిన్నవాదనలు వినిపించారు.

నోటీసులు జారీ చేయాలని ముకుల్‌ రోహత్గీ వాదించగా.. ఆ వాదనలను హరీశ్ సాల్వే తోసిపుచ్చారు. దీంతో సుప్రీంకోర్టు విధివిధానాలను ఇరుపక్షాల న్యాయవాదులు బెంచ్‌ ముందుంచారు. వాదనలకు ఎంత సమయం కావాలని సాల్వేను జస్టిస్ అనిరుద్ధ బోస్‌ ప్రశ్నించగా.. కనీసం గంట కావాలని ఆయన సమాధానమిచ్చారు. గంట సమయం అవసరమైనపుడు ఆ తర్వాతే తాను వస్తానని బెంచ్‌కు ముకుల్‌ రోహత్గీ చెప్పారు. నోటీసులు ఇస్తారా అనే విషయాన్ని బెంచ్‌ తేల్చాలని ఆయన కోరారు. 

హరీశ్‌ సాల్వే వాదిస్తూ కొత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. హైకోర్టులో దాఖలు చేసిన పత్రాల ఆధారంగానే వాదనలు జరుగుతున్నప్పుడు కొత్త డాక్యుమెంట్ల అవసరం ఉండదని జస్టిస్‌ బేలా ఎం. త్రివేది అన్నారు. క్రిమినల్‌ కేసుల్లో మళ్లీ కౌంటర్‌ అఫిడవిట్ల అవసరమేంటని సాల్వే ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వడం కోర్టు విధానాల్లో భాగమని.. అలా కాకపోతే మళ్లీ మొదటికొస్తుందని రోహత్గీ చెప్పారు. నోటీసులు అవసరం లేదన్న విధివిధానాలపై ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అని జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ప్రశ్నించగా.. గతంలో వచ్చిన తీర్పులను బెంచ్‌ ముందు ఉంచుతానని హరీశ్‌ సాల్వే చెప్పారు. 17ఎ చట్టసవరణ ప్రధాన ఉద్దేశం అవినీతిని నిరోధించడమని.. అవినీతి నిరోధంతో పాటు ప్రజాప్రతినిధులపై ప్రతీకార చర్యలు ఉండకూడదన్నది కూడా ప్రధానమేనని కోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లారు. 17ఎ చట్టపరిధిలోని పలు అంశాలను సాల్వే న్యాయస్థానం ముందుంచారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని