Bhagwant Mann: ‘మీ కుర్చీ.. నా భర్త ఇచ్చిన గిఫ్ట్‌’: పంజాబ్ సీఎంకు సిద్ధూ భార్య కౌంటర్‌

పంజాబ్‌ (Punjab) ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ (Bhagwant Mann)కు కాంగ్రెస్‌ నేత సిద్ధూ భార్య గట్టి కౌంటర్‌ ఇచ్చారు. తన భర్త వల్లే భగవంత్‌ మాన్‌ సీఎం కుర్చీలో కూర్చోగలిగారని అన్నారు.

Published : 09 Jun 2023 20:20 IST

చండీగఢ్‌: పంజాబ్‌ (Punjab) కాంగ్రెస్‌ (Congress) నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ (Navjot Singh Sidhu) భార్య నవజ్యోత్‌ కౌర్‌ (Navjot Kaur) శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ (Bhagwant Mann)కు తన భర్త సీఎం కుర్చీని ‘గిఫ్ట్‌’గా ఇచ్చారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర పగ్గాలు సిద్ధూ చేపట్టాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కోరుకున్నారని అన్నారు. కానీ, తన పార్టీని మోసగించడం ఇష్టం లేక సిద్ధూ అందుకు ఒప్పుకోలేదని తెలిపారు. ఇటీవల భగవంత్‌ మాన్‌, సిద్ధూ మధ్య మాటల యుద్ధం జరిగిన నేపథ్యంలో కౌర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అసలేం జరిగిందంటే..

విజిలెన్స్‌ నిఘాలో ఉన్న ఓ పంజాబీ డెయిలీ పత్రిక ఎడిటర్‌కు మద్దతుగా ప్రతిపక్షాలు ఇటీవల జలంధర్‌లో సమావేశమయ్యాయి. దీంతో విపక్ష నేతలపై సీఎం, ఆప్‌ నేత భగవంత్‌ మాన్‌ విమర్శలు గుప్పించారు. దీనికి సిద్ధూ స్పందిస్తూ.. ‘‘దిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిఘా వ్యవస్థగా మార్చిన వారు.. రిమోట్‌ కంట్రోల్‌కు పావుగా మారి రాష్ట్రాన్ని పాలిస్తున్నవారు నైతిక విలువలపై ఉపన్యాసాలు ఇస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు.

ఈ వివాదం నేపథ్యంలో సిద్ధూ సతీమణి నవజ్యోత్‌ కౌర్‌.. సీఎం భగవంత్‌ మాన్‌ను ఉద్దేశిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ‘‘సీఎం భగవంత్‌ మాన్‌జీ.. మీకు సంబంధించిన ఓ రహస్యాన్ని ఇప్పుడు బయటపెడుతున్నా. ఇప్పుడు మీరు అధిష్ఠించిన సీఎం కుర్చీ.. మీ బ్రదర్‌ సిద్ధూ మీకు బహుమతిగా ఇచ్చారని మీరు తెలుసుకోవాలి. పంజాబ్‌ పగ్గాలను సిద్ధూనే చేపట్టాలని ఒకప్పుడు మీ అధినాయకుడు కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) కోరుకున్నారు. రాష్ట్ర ప్రజల పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని చూసి.. సీఎం పదవిని అప్పగించాలని కేజ్రీవాల్‌ అనుకున్నారు. అందుకోసం పలు మార్గాల్లో ప్రయత్నించారు కూడా..! కానీ, సిద్ధూ తన పార్టీ (కాంగ్రెస్)కి వెన్నుపోటు పొడవాలనుకోలేదు. ఆ అవకాశం మీకు కల్పించారు. ఆయన సత్యమార్గంలోనే నడవాలనుకుంటున్నారు. బంగారు పంజాబ్‌ ఆయన కల. అందుకోసమే నిరంతరం శ్రమిస్తున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారు’’ అని కౌర్‌ రాసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు