Ashok Gehlot: రాజస్థాన్‌లో ఈడీ దాడులు.. ఆంతర్యమేంటో అందరికీ తెలుసు: గహ్లోత్‌

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ నేతల ఇళ్లల్లో ఈడీ దాడుల వెనకున్న ఆంతర్యమేంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ అన్నారు.

Published : 26 Oct 2023 15:15 IST

దిల్లీ: రాజస్థాన్‌లో (Rajasthan) కాంగ్రెస్‌ నేతలకు ఈడీ సమన్లు జారీ చేయడం వెనుక ఎన్డీయే ప్రభుత్వ (NDA Govt) హస్తం ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌ (Ashok Gehlot) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతులు, మహిళలు అభివృద్ధి చెందడం కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేదని, కాంగ్రెస్‌ తీసుకురాబోయే అభివృద్ధి ఫలాలు వాళ్లకు అందకుండా ఇప్పటి నుంచే అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. మరో నెల రోజుల్లో రాజస్థాన్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ డోటాస్రా సహా ఒకరిద్దరు నేతల ఇళ్లల్లో ఈడీ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. అంతేకాకుండా అశోక్‌ గహ్లోత్ కుమారుడు వైభవ్‌ గహ్లోత్‌కు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గహ్లోత్‌ మాట్లాడారు.

ఇల్లాలికి రూ.10 వేలు రూ.500కు గ్యాస్‌: అశోక్‌ గహ్లోత్‌

‘‘ కేంద్ర దర్యాప్తు సంస్థలపై ప్రజలకు నమ్మకం పోయింది. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గోవింద్‌ సింగ్‌ ఇంట్లో సోదాలు నిర్వహించారనో, నా కుమారుడికి ఈడీ నోటీసులు జారీ చేసిందనో నేనీ మాటలు అనడం లేదు. భాజపా ప్రభుత్వం దేశ వ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తోంది’’ అని గహ్లోత్‌ అన్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఇంట్లో తనిఖీలు నిర్వహించారని ఆయన ఆరోపించారు. ఇదంతా కేవలం రాజకీయంగా దెబ్బకొట్టేందుకేనని విమర్శించారు. తన కుమారుడు వైభవ్‌ గహ్లోత్‌కు ఈడీ నోటీసులు జారీ చేయడంపై ఆయన స్పందిస్తూ.. ‘‘ ఇదో జోక్‌లా ఉంది. నోటీసులు ఇచ్చిన మరుసటి రోజే విచారణకు రమ్మంటున్నారు. ఆయన విదేశీ లావాదేవీలేవీ జరపలేదు.’’ అని గహ్లోత్‌ వ్యాఖ్యానించారు. ఇందులో భయపడాల్సిందేమీ లేదని భాజపాకి వ్యతిరేకంగా వ్యవహరించిన వారు ఈడీ విచారణ ఎదుర్కోవడం కొత్తేమీ కాదని గహ్లోత్‌ అన్నారు. రాజస్థాన్‌లో ఈడీ దాడులు ఎందుకు జరుగుతున్నాయో, దీని వెనక ఆంతర్యమేంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ మహిళలకు అక్టోబర్‌ 25న హామీలు ప్రకటిస్తే... ఆ తర్వాతి రోజే రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ ఇంట్లో ఈడీలు జరగడమే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే గ్యాస్‌ సిలిండర్‌ను రూ.500కే ఇస్తామని, మహిళలకు ఏడాదికి రూ.10వేల గౌరవ భృతి ఇస్తామని గహ్లోత్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం: ఖర్గే

మరోవైపు ఈడీ దాడులను కాంగ్రెస్‌ అధిష్ఠానం తీవ్రంగా ఖండించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐతోపాటు ఆదాయపు పన్ను శాఖలు భాజపాకి వత్తాసు పలుకుతున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రాజస్థాన్‌లో ఓటమి తప్పదని గ్రహించిన భాజపా చివరి పాచికగా ఈడీని ప్రయోగిస్తోందని ఆయన ఆరోపించారు. భాజపా ప్రభుత్వ నియంతృత్వ పోకడలు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఏజెన్సీల దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని, ప్రజలే భాజపాకి తగిన బుద్ధి చెబుతారని ఖర్గే అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని