ఇల్లాలికి రూ.10 వేలు రూ.500కు గ్యాస్‌: అశోక్‌ గహ్లోత్‌

రాజస్థాన్‌లో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం  హామీల వర్షం కురిపిస్తోంది.

Published : 26 Oct 2023 05:50 IST

జైపుర్‌: రాజస్థాన్‌లో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం  హామీల వర్షం కురిపిస్తోంది. మళ్లీ కాంగ్రెస్‌ను గెలిపిస్తే రాష్ట్రంలోని దాదాపు 1.05 కోట్ల కుటుంబాలకు రూ.500కు వంటగ్యాస్‌ సరఫరా చేస్తామని, ప్రతి ఇంట్లో కుటుంబపెద్దగా ఉన్న మహిళకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున గౌరవ వేతనంగా ఇస్తామని అశోక్‌ గహ్లోత్‌ ప్రకటించారు. బుధవారం ఝున్‌ఝునూలో నిర్వహించిన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ.. ‘గృహలక్ష్మి గ్యారెంటీ’ పథకంలో భాగంగా మహిళలకు రూ.10 వేల మొత్తాన్ని వాయిదా పద్ధతుల్లో చెల్లిస్తామన్నారు.


భాజపా పథకాలు శూన్యం

- ప్రియాంక

కేంద్రంలోని భాజపా సర్కారు పథకాలన్నీ శూన్యమంటూ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ విరుచుకుపడ్డారు. రాజస్థాన్‌లోని అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ఝున్‌ఝునూ సభలో ప్రియాంక మాట్లాడుతూ.. కేంద్రం తెచ్చిన మహిళా రిజర్వేషను బిల్లు అమలు కావాలంటే మరో పదేళ్లు పడుతుందన్నారు. తూర్పు రాజస్థాన్‌ కెనాల్‌ ప్రాజెక్టు (ఈఆర్‌సీపీ) ప్రకటించి పదేళ్లు గడిచాయని తెలిపారు. ఎన్నికల సమయంలో కులం, మతం గురించి మాట్లాడితేనే ఓట్లు పడతాయని భాజపా భావిస్తోందన్నారు. ఈ సభలో ప్రియాంక సమక్షంలో ఎమ్మెల్యే శోభారాణి కుశ్వాహ్‌ కాంగ్రెస్‌లో చేరారు. గతేడాది రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగుకు పాల్పడినందుకు శోభారాణిని భాజపా బహిష్కరించింది. ఈమెతోపాటు కిషన్‌గఢ్‌ భాజపా నేత వికాస్‌ చౌధరి, జాతీయ మహిళా కమిషన్‌ మాజీ అధ్యక్షురాలు మమతాశర్మ కూడా కాంగ్రెస్‌లో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని