Congress: వేధిస్తున్నారని చెబితే.. వేటు వేశారు! వివాదంలో కాంగ్రెస్‌

ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ బి.వి. శ్రీనివాస్‌పై వేధింపుల ఆరోపణలు చేసిన అస్సాం యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు అంకిత దత్తాపై హస్తం పార్టీ (Congress) వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గానూ ఆరేళ్ల పాటు బహిష్కరించింది.

Published : 22 Apr 2023 14:55 IST

దిల్లీ: అస్సాం (Assam) యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు అంకిత దత్తా (Angkita Dutta)పై కాంగ్రెస్‌ (Congress) పార్టీ వేటు వేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. పార్టీలో కొందరు తనను వేధిస్తున్నారంటూ అంకిత ఆరోపణలు చేసిన రోజుల వ్యవధిలోనే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై భాజపా (BJP) స్పందిస్తూ.. హస్తం పార్టీకి చురకలంటించింది. అసలేం జరిగిందంటే..

ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ బి.వి. శ్రీనివాస్‌ (Srinivas B V) తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని, తనపై వివక్ష చూపిస్తున్నారని అంకిత ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ (Congress) అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా దృష్టికి తీసుకెళ్లినా.. వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దీనిపై గత బుధవారం ఆమె దిస్పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే అస్సాం పోలీసు సీఐడీ విభాగం.. శ్రీనివాస్‌కు సమన్లు జారీ చేసింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని అటు జాతీయ మహిళా కమిషన్‌ కూడా రాష్ట్ర పోలీసులను కోరింది.

ఈ వివాదం కొనసాగుతుండగానే.. అంకిత (Angkita Dutta)పై కాంగ్రెస్‌ బహిష్కరణ వేటు వేసింది. ఈ మేరకు కాంగ్రెస్‌ క్రమశిక్షణా చర్యల కమిటీ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గానూ ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని ఆరేళ్ల పాటు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అంకిత చేసిన ఆరోపణలు నిరాధారం, రాజకీయ ప్రేరేపితమైనవిగా గుర్తించినట్లు అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్‌ కమిటీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ నేతల పరువుకు భంగం కలిగించే చర్యలకు పాల్పడినందుకు గానూ ఆమెను బహిష్కరించినట్లు తెలిపాయి.

భాజపా వ్యంగ్యాస్త్రాలు..

కాగా.. ఈ పరిణామాలపై స్పందించిన భాజపా (BJP).. కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించింది. ‘‘మహిళా సాధికారత కోసం కాంగ్రెస్‌ అవలంబిస్తున్న విధానమిది..! సీనియర్‌ నేతలు వేధిస్తున్నారని చెప్పిన మహిళ సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఆమెపైనే వేటు వేశారు. అంకిత దత్తా విషయంలో కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయం.. ఆమోదయోగ్యం కాదు. ‘నేను మహిళను.. నేను పోరాడగలను’ అని కాంగ్రెస్‌ చెప్పే నినాదం.. వట్టి మాటే’’ అని భాజపా ఎద్దేవా చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు