Jammu Kashmir: మంచు కశ్మీర్‌లో మాటల మంటలు..! ఫరూక్‌, ఒమర్‌లపై ఆజాద్‌ తీవ్ర వ్యాఖ్యలు

ఆర్టికల్ 370 రద్దుపై ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లాలకు ముందస్తు సమాచారం ఉందని గులాం నబీ ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

Published : 19 Feb 2024 22:02 IST

శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్‌ (Jammu Kashmir) రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ‘ఆర్టికల్‌ 370 (Article 370)’ రద్దుకు ముందు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా (Farooq Abdullah), ఆయన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లాలతో సంప్రదింపులు జరిగాయంటూ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్‌ (Ghulam Nabi Azad) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా ఆజాద్‌ దిగజారిపోయారని ఫరూక్‌ మండిపడ్డారు. ఎవరు ఆజాద్ (స్వతంత్రుడు)? ఎవరు గులాం (బానిస)? అనేది కాలమే చెబుతుందని, ప్రజలే నిర్ణయిస్తారని ఒమర్‌ పేర్కొన్నారు.

‘‘ఆర్టికల్ 370 రద్దుపై ఫరూక్‌, ఒమర్‌లకు ముందస్తు సమాచారం ఉందని, సొంత విజ్ఞప్తి మేరకే వారిని గృహ నిర్బంధం చేశారని 2019లో ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. వారు రాత్రి 11 గంటల తర్వాతే దిల్లీ నేతల సమయం కోరుతున్నారు. ఈ రహస్య మంతనాలు ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఓ వర్గం ఓట్లను రాబట్టుకునేందుకు యత్నిస్తున్నారు. తండ్రీకుమారులు శ్రీనగర్‌లో ఒక మాట.. దిల్లీలో ఒక మాట మాట్లాడుతూ.. తెలివైన ఆట ఆడుతున్నారు’’ అని ఆజాద్ ఓ ఇంటర్వ్యూలో తీవ్ర ఆరోపణలు చేశారు.

ఆ ఆఫర్‌కు ఓకే చెప్తే రాహుల్‌ వెంట నడుస్తా.. కాంగ్రెస్‌కు అఖిలేశ్‌ కండీషన్

ఆజాద్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదమని, రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు ఈస్థాయికి దిగజారడం విచారకరమని ఫరూక్‌ అన్నారు. 2015లో రాజ్యసభ సీటు కోసం తమ పార్టీ ఆయనకు మద్దతు అందించినట్లు గుర్తుచేశారు. ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం తాము ఎనిమిది నెలలకు పైగా నిర్బంధంలో ఉన్నామని, స్వేచ్ఛగా తిరిగిన ఏకైక మాజీ సీఎం ఆజాదేనని ఒమర్‌ పేర్కొన్నారు. పద్మ పురస్కారం కోసం కాంగ్రెస్‌ను వీడి, భాజపాకు సాయం చేసేందుకు అంగీకరించిన విషయం మరచిపోవద్దని ట్వీట్‌ చేశారు.

ఈ ట్వీట్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ స్పందిస్తూ.. ‘‘ఆయన నుంచి మీరు ఇంకేమైనా ఆశించారా? ఆయనది ఎప్పుడూ అవమానకర వైఖరే’’ అని విమర్శించారు. ఇదిలా ఉండగా.. జమ్మూ-కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ‘ఆర్టికల్‌ 370’ను కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని