Balineni: అందులో నాకు పెట్టుబడులు లేవు.. నిరూపిస్తే ఆస్తి మొత్తం రాసిస్తా: బాలినేని

సినీరంగంలో పెట్టుబడుల ఆరోపణలపై ఏపీ మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు.

Updated : 23 Apr 2023 16:53 IST

ఒంగోలు: సినీరంగంలో పెట్టుబడుల ఆరోపణలపై ఏపీ మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలో పెట్టుబడులున్నట్లు బాలినేనిపై విశాఖకు చెందిన జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ ఇటీవల ఐటీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.  ఈ నేపథ్యంలో బాలినేని స్పందిస్తూ వివరణ ఇచ్చారు.

సినీ నిర్మాణ సంస్థలో తనకు పెట్టుబడులు ఉన్నాయన్న ఆరోపణలు సరికాదని బాలినేని అన్నారు. తనతో పాటు తన వియ్యంకుడు భాస్కర్‌రెడ్డికి ఆ నిర్మాణ సంస్థలో రూపాయి కూడా పెట్టుబడి లేదని స్పష్టం చేశారు. ఆ ఆరోపణలను రుజువు చేస్తే తన ఆస్తి మొత్తం రాసిస్తానని.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని సవాల్‌ చేశారు. తమపై దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.  తనకు పెట్టుబడులు ఉన్నాయో లేదో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆరా తీసుకోవచ్చని ఈ సందర్భంగా బాలినేని వ్యాఖ్యానించారు. 

జనసేన కార్పొరేటర్‌ చేసిన ఆరోపణలు ఇవీ..

ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ అక్రమ లావాదేవీల విషయంలో మాజీ మంత్రి బాలినేని బినామీ, ఆయన వియ్యంకుడు కుండా భాస్కరరెడ్డి, వైకాపా నేత, ఆడిటర్‌ గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ)లపై విచారణ జరిపించాలని విశాఖలోని ఆదాయ పన్నుల శాఖ నిఘా అమలు విభాగం కమిషనర్‌కు జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ శుక్రవారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ పోర్టు స్టేడియం వెనుక ఎస్‌బీఐ పక్కనే ఉన్న కార్యాలయంలోనూ దాడులు కొనసాగుతున్నాయని, ఈ చలనచిత్ర నిర్మాణ సంస్థ అక్రమాస్తులు, లావాదేవీలపై దిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం దాడులు నిర్వహిస్తోందని చెప్పారు. 

అక్రమాస్తులు, లావాదేవీల వెనుక తెలంగాణకు చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఆంధ్రకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయని తెలిపారు. బాలినేని బినామీగా పేరొందిన ఆయన వియ్యంకుడు, విశాఖకు చెందిన కుండా భాస్కరరెడ్డి ఈ వ్యవహారాలు నడిపినట్లుగా ఆధారాలున్నాయన్నారు. వైకాపాకు చెందిన ఆడిటర్‌ జీవీ ప్రమేయం కూడా ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. వీరి ద్వారా జరిగిన అక్రమ లావాదేవీలు, నగదు పంపకాలపై విచారణ జరిపించాలని కోరినట్లు తెలిపారు. బాలినేని బినామీగా పేరొందిన ఆయన వియ్యంకుడు, విశాఖకు చెందిన కుండా భాస్కరరెడ్డి ఈ వ్యవహారాలు నడిపినట్లుగా ఆధారాలున్నాయన్నారు. వైకాపాకు చెందిన ఆడిటర్‌ జీవీ ప్రమేయం కూడా ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. వీరి ద్వారా జరిగిన అక్రమ లావాదేవీలు, నగదు పంపకాలపై విచారణ జరిపించాలని కోరినట్లు తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని