Baramati: శరద్‌పవార్‌ను రాజకీయంగా అంతం చేసేందుకే.. ‘కుటుంబ పోరు’పై సుప్రియా సూలే

శరద్‌ పవార్‌ను రాజకీయంగా అంతం చేసేందుకే బారామతిలో తనకు, సునేత్రా పవార్‌కు మధ్య ఎన్నికల పోటీ జరిగేలా భాజపా కుట్ర పన్నిందని సుప్రియా సూలే ఆరోపించారు.

Published : 01 Apr 2024 00:03 IST

పుణె: శరద్‌ పవార్‌ (Sharad Pawar)ను రాజకీయంగా అంతమొందించడమే లక్ష్యంగా బారామతిలో ‘కుటుంబ పోరు’ జరిగేలా భాజపా (BJP) కుట్ర పన్నిందని సుప్రియా సూలే (Supriya Sule) ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) ఈ స్థానం నుంచి మరోసారి బరిలో దిగిన సుప్రియాపై.. ఆమె సోదరుడు అజిత్‌ పవార్‌ సతీమణి సునేత్ర పోటీ చేయనున్న విషయం తెలిసిందే. అయితే.. ఆమె తనకు తల్లితో సమానమని, ప్రస్తుత పరిణామాలు ఆమె పట్ల తనకున్న గౌరవాన్ని తగ్గించవని సూలే స్పష్టం చేశారు.

‘‘పవార్ కుటుంబానికి, మహారాష్ట్రకు వ్యతిరేకంగా భాజపా ఈ కుట్ర పన్నింది. సునేత్రను బరిలోకి దించడం అభివృద్ధి కోసం కాదు. శరద్‌ పవార్‌ను రాజకీయంగా అంతం చేసేందుకే. ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత కూడా ఈ మాట అన్నారు. రాష్ట్రంలో కమలదళానికి బలమైన అభ్యర్థులు లేరు. కాబట్టే, నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. మరాఠీ మాట్లాడే ప్రజల మధ్య చీలికలు సృష్టించేందుకు యత్నిస్తోంది. సైద్ధాంతికపరంగా సాగే మా పోరును వ్యక్తిగతం చేసింది’’ అంటూ భాజపాపై సూలే విరుచుకుపడ్డారు.

శరద్‌ పవార్‌ కుటుంబానికి పట్టున్న స్థానం బారామతి. 2009 నుంచి సుప్రియ ఇక్కడ ఎంపీగా ఉన్నారు. మరోవైపు.. అజిత్‌ 1991 నుంచి బారామతి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు సోదరి విజయంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ప్రస్తుతం కుమార్తె తరఫున శరద్‌ పవార్‌ సైతం రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ.. సమావేశాలు నిర్వహిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో భాగంగా మే 7న ఈ స్థానానికి పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని