Nitin Gadkari: నితిన్‌ గడ్కరీ ఇలాకాలో భాజపాకి ఎదురుదెబ్బ

నితిన్‌ గడ్కరీ సొంత నియోజకవర్గం నాగ్‌పూర్‌లో భాజపాకి ఎదురుదెబ్బ తగిలింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలో ఆ పార్టీ మద్దతుదారు ఓటమిపాలయ్యారు.

Updated : 02 Feb 2023 22:32 IST

నాగ్‌పూర్‌:  కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) సొంత నియోజకవర్గం నాగ్‌పుర్‌ (Nagpur)లో భాజపా (BJP)కు ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి భాజపా మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి నాగో గనార్‌ పరాజయం పాలయ్యారు. ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్‌ అఘాడీ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థి సుధాకర్‌ అడ్బాలే విజయం సాధించారు. ఆరెస్సెస్‌లోని పలువురు కీలక వ్యక్తులతోపాటు, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ కూడా ఈ నియోజవర్గానికి చెందిన వారైనప్పటికీ వారి మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి పరాజయం పాలవ్వడం గమనార్హం.

శివసేన నుంచి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే వర్గం విడిపోయిన తర్వాత జరిగిన కీలక ఎన్నికలో భాజపా మద్దతుదారు ఓడిపోవడం చర్చలకు తావిస్తోంది. రాష్ట్రంలో ఎగువసభ అయిన శాసనమండలిలో.. భాజపా మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శిందే వర్గానికి, ఉద్ధవ్‌ ఠాక్రే  వర్గాలకు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. శాసనమండలిలో మూడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీల పదవీకాలం ఈ నెల 7తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఐదు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానమైన కొంకణ్‌లో అత్యధికంగా 91.02 శాతం ఓట్లు పోలవ్వగా, నాసిక్‌లో అత్యల్పంగా 49.28శాతం ఓట్లు పోలయ్యాయి. ఔరంగాబాద్‌లో 86శాతం పోలింగ్‌ నమోదైంది. మిగతా నాలుగు ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని