Lok Sabha Election Results: సగం.. సగం..

‘హస్త’ రేఖలు వికసించాయి.. కమలం గుబాళించింది. కారు మాత్రం కదలనని మొరాయించింది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల తీరిది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, భాజపా చెరి సగం సీట్లు పంచుకున్నాయి.

Updated : 05 Jun 2024 07:29 IST

కాంగ్రెస్, భాజపాలకు ఎనిమిదేసి స్థానాలు
లోక్‌సభ ఎన్నికల్లో ఖాతా తెరవని భారాస
భారాసకు రెండింటిలోనే రెండో స్థానం...14 చోట్ల మూడో స్థానం
కారుకు ఓట్లు తగ్గిన చోట లాభపడిన కమలం
నల్గొండ కాంగ్రెస్‌ అభ్యర్థి రఘువీర్‌కు తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యధికంగా 5.5 లక్షల మెజార్టీ
ఎంఐఎందే హైదరాబాద్‌
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో హస్తం జయకేతనం

‘హస్త’ రేఖలు వికసించాయి.. కమలం గుబాళించింది. కారు మాత్రం కదలనని మొరాయించింది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల తీరిది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, భాజపా చెరి సగం సీట్లు పంచుకున్నాయి. భారాస పూర్తిగా చతికిలపడింది. హైదరాబాద్‌లో ఎంఐఎం యథావిధిగా జయకేతనం ఎగురవేసింది. సవాళ్లు, ప్రతి సవాళ్లు.. తీవ్రమైన ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ హోరాహోరీగా సాగిన సార్వత్రిక పోరులో కాంగ్రెస్, భాజపాలకు ఉపశమనం లభించగా.. భారాసకు తీవ్ర నిరాశ మిగిలింది. ఆరు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్‌.. లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. ఆ పార్టీ గత సార్వత్రిక ఎన్నికల కంటే ఐదు స్థానాలు అధికంగా సాధించింది. మొన్నటి శాసనసభ  ఎన్నికల్లో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు, 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు సాధించిన భారతీయ జనతా పార్టీ.. ఈసారి లోక్‌సభ పోరులో ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న భారాస.. ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 14 లోక్‌సభ స్థానాల్లో మూడో స్థానానికే పరిమితమైంది. కేవలం ఖమ్మం, మహబూబాబాద్‌లలో మాత్రమే ఆ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌లో నాలుగో స్థానానికి చేరింది. భారాస ఆవిర్భావం నుంచీ చూస్తే.. ఏ ఎన్నికల్లోనూ ‘సున్నా’ ఫలితాలు నమోదు చేయలేదు. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడం ఇదే తొలిసారి. భారాస ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మృతితో అనివార్యమైన కంటోన్మెంట్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ ఉప ఎన్నికలో అధికార పార్టీ కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీగణేశ్‌ జయకేతనం ఎగురవేశారు.


కాంగ్రెస్, భాజపాలకు ఎనిమిదేసి స్థానాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో హోరాహోరీగా సాగిన లోక్‌సభ ఎన్నికల పోరులో కాంగ్రెస్, భాజపాలు సమానంగా సీట్లు దక్కించుకున్నాయి. 17 స్థానాలకు గాను కాంగ్రెస్‌ ఎనిమిది, భాజపా ఎనిమిది చోట్ల విజయం సాధించగా.. ఎంఐఎం హైదరాబాద్‌ నియోజకవర్గంలో తిరిగి తన పట్టును నిలుపుకొంది. దశాబ్దకాలం పాటు రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన భారాస తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఖాతా తెరవకపోగా, రెండు దశాబ్దాల తర్వాత మొదటిసారి లోక్‌సభలో ఆ పార్టీ ప్రాతినిధ్యం కోల్పోయింది. గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలను గెలిచిన భాజపా ఇప్పుడు ఎనిమిదింటిని దక్కించుకొని బలాన్ని గణనీయంగా పెంచుకొంది. గత ఎన్నికల్లో గెలిచిన నాలుగింటితో పాటు మరో నాలుగు చోట్ల నెగ్గింది. కాంగ్రెస్‌ బలం మూడు నుంచి ఎనిమిదికి పెరిగింది. అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గెలిచిన మల్కాజిగిరి లోక్‌సభ స్థానాన్ని కోల్పోయింది. కాంగ్రెస్, భాజపాలకు సమానంగా సీట్లు వచ్చినా ఓట్ల శాతంలో కాంగ్రెస్‌ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40.10 శాతం ఓట్లు రాగా, భాజపాకు 35.08 శాతం, భారాసకు కేవలం 16.68 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. భారాస ఓటు భాజపాకు గణనీయంగా మళ్లినట్లు ఫలితాలను బట్టి స్పష్టమవుతోంది. కాంగ్రెస్‌.. అసెంబ్లీ ఎన్నికల కంటే ఓటు శాతాన్ని పెంచుకున్నా, భారాస గణనీయంగా కోల్పోయిన ఓటు భాజపాకు లాభించింది. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ, భువనగిరి, నాగర్‌కర్నూల్, జహీరాబాద్, పెద్దపల్లి స్థానాలను కాంగ్రెస్‌; సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ స్థానాలను భాజపా; హైదరాబాద్‌ను ఎంఐఎం దక్కించుకున్నాయి. భాజపా నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సహా పోటీ చేసిన మరో ఇద్దరు సిటింగ్‌ ఎంపీలు గెలుపొందారు. నల్గొండ నుంచి గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి రఘువీర్‌కు తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యధికంగా 5.5 లక్షల మెజార్టీ వచ్చింది. మహబూబ్‌నగర్‌ నుంచి భాజపా తరఫున డి.కె. అరుణ అతి తక్కువగా 4,500 ఓట్ల తేడాతో గెలిచారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉండే మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానంలో భాజపా, కాంగ్రెస్‌ మధ్య ఉత్కంఠ పోరు సాగగా, చివరకు కమలమే గెలిచింది. రాష్ట్రంలో పైకి త్రిముఖ పోటీలా కనిపించినా ప్రధాన పోటీ కాంగ్రెస్, భాజపాల మధ్యనే సాగిందన్న విషయం ఫలితాలను బట్టి స్పష్టమవుతోంది.

ఎంపీగా గెలుపొందిన మల్లు రవిని అభినందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

అసెంబ్లీ ఫలితాలకు తగ్గట్లుగానే కాంగ్రెస్‌కు సీట్లు!

ఆరునెలల క్రితం 64 అసెంబ్లీ స్థానాలను గెల్చుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, తొమ్మిది లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఆధిక్యాన్ని సాధించింది. ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించింది. మంత్రులను, ముఖ్యనాయకులను లోక్‌సభ స్థానాల వారీగా ఇన్‌ఛార్జులుగా నియమించి హోరాహోరీగా పోరాడింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముమ్మరంగా ప్రచారం చేశారు. అయితే ఒక్క మహబూబ్‌నగర్‌ మినహా మిగిలిన ఎనిమిది స్థానాలను కాంగ్రెస్‌ గెల్చుకొంది. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో భారాస కంటే లక్ష ఓట్ల ఆధిక్యాన్ని సాధించిన కాంగ్రెస్‌... లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం గట్టిగా పోరాడి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం పరిధిలో కేవలం లక్షా 13 వేల ఓట్లు సాధించిన భాజపా ఇప్పుడు ఏకంగా 5.10 లక్షల ఓట్లను సాధించి లోక్‌సభ సీటును దక్కించుకొంది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఐదు లక్షలకు పైగా ఓట్లు పొందిన భారాస ఈ సారి 1.54 లక్షలకు పరిమితమైంది. ఇక్కడే కాదు భారాస భారీగా ఓట్లను కోల్పోయిన చోట భాజపా ఎక్కువగా లబ్ధి పొందింది. నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్‌ తదితర లోక్‌సభ నియోజకవర్గాల్లో భాజపాకు అసెంబ్లీ ఎన్నికలకు మించి ఓట్లు వచ్చాయి. ఆదిలాబాద్, సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాల పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ ఇప్పుడు భాజపాకు గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ... అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర పోటీ ఇచ్చిన భారాస ఇప్పుడు భారీ తేడాతో ఓడిపోవడం గమనార్హం.

వైభవం కోల్పోయిన గులాబీ జెండా

తెలంగాణ ఆవిర్భావం తర్వాత తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమిపాలైన భారాసను లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కోలుకోలేని దెబ్బతీశాయి. ఈ ఎన్నికల్లో గులాబీ జెండా వైభవం కోల్పోయింది. పార్టీ అధినేత కేసీఆర్‌ సహా ముఖ్యనేతలు విస్తృతంగా ప్రచారం చేసినా ఫలితం దక్కకపోగా,  పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఆరునెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఆధిక్యం సాధించగా, ఆ ఏడింటిలోనూ ఇప్పుడు భారాస మూడో స్థానానికి పరిమితమైంది. శాసనసభ ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ స్థానాలను గెల్చుకొన్న మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో కూడా సత్తా చాటలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం నుంచి కోలుకొని లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కాకపోవడం, అభ్యర్థుల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, కింది స్థాయి నుంచి కార్యకర్తలను సమాయత్తం చేయకపోవడం తదితర       కారణాలతో ఆ పార్టీకి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. భారాస అధ్యక్షుడు కేసీఆర్‌ చేపట్టిన బస్సు యాత్ర సందర్భంగా జనాన్ని సమీకరించడం, ముఖ్యనాయకులు కేటీఆర్, హరీశ్‌రావులు వచ్చినప్పుడు రోడ్‌షోలు నిర్వహించడం మినహా, నియోజకవర్గ స్థాయి నాయకులు, ప్రత్యేకించి ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ప్రాధాన్యం ఇచ్చి లోక్‌సభ ఎన్నికల్లో పని చేయలేదన్న అభిప్రాయం ఉంది. కేసీఆర్, పార్టీ సీనియర్‌ నేత హరీశ్‌రావులు   ప్రాతినిధ్యం వహించే గజ్వేల్, సిద్దిపేట అసెంబ్లీ స్థానాలు ఉన్న మెదక్‌ లోక్‌సభ స్థానంలో కూడా భారాస మూడో స్థానానికి పరిమితమైంది. 17 లోక్‌సభ స్థానాల్లో ఖమ్మం, మహబూబాబాద్‌లో రెండు చోట్ల మాత్రమే భారాస రెండో స్థానంలో నిలవగా, 14 చోట్ల మూడో స్థానానికి పరిమితమైంది. హైదరాబాద్‌లో నాలుగో స్థానంలో నిలిచింది.


పట్టు సాధించిన భాజపా

తెలంగాణలో భాజపా పట్టు సాధించింది. అసెంబ్లీ  ఎన్నికల్లో నామమాత్రంగా సీట్లు పొందిన ఆ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా ఎనిమిది సీట్లు గెలుచుకొంది. కాంగ్రెస్‌తో ఢీ అంటే ఢీ అన్నట్లుగా నిలిచింది. తెలంగాణలో మంచి అవకాశాలున్నాయని భావించిన భాజపా అధిష్ఠానం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంది. భారాస ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టి విజయం సాధించింది. భారాసకు ఆయువుపట్టు లాంటి కరీంనగర్‌లో భారీ ఆధిక్యంతో విజయాన్ని నమోదు చేసింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న మెదక్‌ లోక్‌సభ స్థానాన్ని కూడా దక్కించుకొంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌ ఉండే మహబూబ్‌నగర్‌ కూడా భాజపా ఖాతాలో చేరింది. మల్కాజిగిరిలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ 3.91 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలవగా, కరీంనగర్‌లో బండి సంజయ్‌ 2.25 లక్షల ఓట్ల మెజార్టీని సాధించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు