Loksabha Polls: ఎన్నికల మేనిఫెస్టో కమిటీ జాబితాను ప్రకటించిన భాజపా

రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టో కమిటీ జాబితాను భారతీయ జనతా పార్టీ(భాజపా) శనివారం ప్రకటించింది.    

Published : 30 Mar 2024 20:54 IST

 

దిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో కమిటీ జాబితాను భారతీయ జనతా పార్టీ(భాజపా) శనివారం ప్రకటించింది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో 27మంది సభ్యుల కమిటీని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఈ కమిటీకి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను  కన్వీనర్‌గా, పీయూష్‌ గోయల్‌ను కో కన్వీనర్‌గా పార్టీ నియమించింది.

ప్యానెల్ సభ్యులలో వసుంధర రాజే, స్మృతి ఇరానీ, శివరాజ్ సింగ్ చౌహాన్, ధర్మేంద్ర ప్రధాన్, అర్జున్ ముండా, అశ్విని వైష్ణవ్, కిరెన్ రిజిజు మొదలైన భాజపా అగ్రనేతలు ఉన్నారు. కమిటీలో వీరితో పాటు అదనంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్ ల ముఖ్యమంత్రులు విష్ణుదేవ్ సాయి, భూపేంద్ర పటేల్ సభ్యులుగా ఉన్నారు.

ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి లోక్‌సభలో 400 కంటే ఎక్కువ సీట్లు సాధించాలనే లక్ష్యంతో  అధికార ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల బరిలోకి దిగింది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని ఇండియా కూటమి ప్రయత్నాలు మొదలుపెట్టింది.

లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు ఏడు విడతల్లో జరగనున్నాయి. దాదాపు 97 కోట్ల మంది అర్హులైన ఓటర్లు 543 మంది సభ్యులున్న పార్లమెంటు దిగువ సభకు ప్రతినిధులను ఎన్నుకోవడానికి తమ ఓటు హక్కును వినియోగించుకోన్నారు. జూన్‌ 4న ఫలితాలు వెలువడతాయి.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని