Mahua Moitra: మహువా మొయిత్రా vs రాజమాత.. బెంగాల్‌లో మరో ఆసక్తికర పోరు

Mahua Moitra: టీఎంసీ అభ్యర్థి మహువా మొయిత్రాకు పోటీగా రాజమాత అమృతా రాయ్‌ని రంగంలోకి దించింది భాజపా. దీంతో కృష్ణానగర్‌ లోక్‌సభ పోరు రసవత్తరంగా మారింది.

Published : 25 Mar 2024 14:17 IST

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌ (West Bengal)పై భారతీయ జనతా పార్టీ (BJP) గట్టిగా దృష్టిపెట్టింది. 42 స్థానాలున్న ఈ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో (Lok sabha Elections) వీలైనన్ని ఎక్కువస్థానాలు గెలిచేందుకు పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అభ్యర్థుల ఎంపికలోనూ అంతే పక్కాగా వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే టీఎంసీ కీలక నేత మహువా మొయిత్రా (Mahua Moitra)కు పోటీగా స్థానిక రాజమాత (Rajamata)ను నిలబెట్టింది. దీంతో కృష్ణానగర్‌ పోరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

భాజపా ఆదివారం 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో పశ్చిమ బెంగాల్‌లో 19 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. నదియా జిల్లాలోని కృష్ణానగర్‌ నుంచి రాజవంశస్థురాలైన రాజమాత అమృతా రాయ్‌ (Amrita Roy)ను బరిలోకి దించింది. స్థానికంగా ఈ రాజకుటుంబానికి ఉన్న ప్రాబల్యంతో విజయం సాధించాలని కాషాయ పార్టీ ఆశిస్తోంది.

ఆ రాజు పేరు మీదుగానే కృష్ణానగర్‌

 రాజవంశానికి చెందిన రాజా కృష్ణచంద్ర రాయ్‌ 18వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించారు. తన 55 ఏళ్ల పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. బెంగాలీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించి చరిత్రకెక్కారు. ఆయన రాజ్యపాలన ఇప్పటికీ బెంగాల్‌ వాసులకు గుర్తుండిపోతుంది. ఆయన పేరు మీదుగానే ఈ ప్రాంతానికి కృష్ణానగర్‌ అని పేరు పెట్టారు. ఈ వంశానికి చెందిన వ్యక్తే రాజమాత అమృతారాయ్‌. వీరి కుటుంబానికి స్థానికంగా మంచి పేరుంది.

భాజపా అభ్యర్థిగా ‘సందేశ్‌ఖాలీ’ బాధితురాలు..

తృణమూల్‌ కంచుకోట..

కృష్ణానగర్‌ స్థానంలో తృణమూల్‌కు గట్టి పట్టు ఉంది. 2009 నుంచి ఇక్కడ ఈ పార్టీనే వరుసగా విజయం సాధిస్తోంది. 2019లో టీఎంసీ నుంచి మహువా మొయిత్రా.. తన సమీప భాజపా అభ్యర్థిపై 60వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత నుంచి భాజపాపై పదునైన విమర్శలతో ఆమె వార్తల్లో నిలిచారు. ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపణలు రావడంతో గతేడాది ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.

అయినప్పటికీ టీఎంసీ ఆమెకు మరోసారి టికెట్‌ ఇచ్చింది. ఈసారి బెంగాల్‌లో వామపక్షాలు పోటీ చేసే అవకాశాలు లేకపోవడంతో కృష్ణానగర్‌లో మహువా, రాజమాత మధ్య ప్రధాన పోటీ నెలకొననుంది. దీంతో ఈ పోరు ఆసక్తికరంగా మారింది. మరి వీరిలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే జూన్‌ 4వ తేదీ వరకు ఆగాల్సిందే..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని