JP Nadda: అకౌంట్‌ ఫ్రీజ్‌ చేస్తే ఇబ్బందేంటి?.. ‘స్కామ్‌’ డబ్బు ఉందిగా!: నడ్డా

కాంగ్రెస్‌ పార్టీ నైతికంగా దివాలా తీసిందే తప్ప.. ఆర్థికంగా కాదని భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా విమర్శించారు. ఆ పార్టీ బ్యాంక్‌ అకౌంట్‌ ఫ్రీజ్‌ అయినా.. వివిధ స్కామ్‌ల ద్వారా సంపాదించిన డబ్బును ఎన్నికల కోసం వినియోగించుకోవచ్చని ఎద్దేవా చేశారు.

Published : 21 Mar 2024 15:41 IST

దిల్లీ: కాంగ్రెస్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రధాని మోదీ (PM Modi) తీవ్ర చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ (Sonia Gandhi), రాహుల్‌ (Rahul Gandhi), ఖర్గే (Mallikarjun Kharge) చేసిన ఆరోపణలను భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP nadda) తిప్పికొట్టారు. వాళ్ల ఆర్థిక అసమర్థతను కప్పి పుచ్చుకొనేందుకే హస్తం పార్టీ నేతలు కొత్త స్వరాన్ని అందుకున్నారని విమర్శించారు. బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్‌ చేసినా.. గతంలో వివిధ స్కామ్‌ల ద్వారా సంపాదించిన మొత్తాన్ని ఎన్నికల కోసం వినియోగించుకోవచ్చని ఎద్దేవా చేశారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.  కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్‌ చేయడంతో ఎలాంటి లావాదేవీలు చేయడం కుదరడం లేదని, ఎన్నికల సమయంలో ప్రచారం కోసం ప్రకటనలు ఇవ్వడం సాధ్యపడటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ.. వెంటనే ఖాతాని అన్‌ఫ్రీజ్‌ చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నడ్డా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

‘‘కాంగ్రెస్‌ ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయి. వాళ్ల ఆర్థిక అసమర్థతను చాలా సులువుగా పక్కవారిపై నెట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి వారు నైతికంగా దివాలా తీశారే తప్ప, ఆర్థికంగా కాదు’’ అని నడ్డా వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు పూర్తిగా విస్మరిస్తారని అన్నారు.  చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆ పార్టీ ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంటుందన్నారు. తమ తప్పులను సరిదిద్దుకోకుండా, అధికారులను, వ్యవస్థలను నిందించడం సరికాదని హితవు పలికారు. నిబంధనల ప్రకారం పన్ను చెల్లించకుండా తాత్సారం చేస్తుంటే అధికారులు చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించారు. భారత్‌లో ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడిందంటూ కొందరు కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారన్న నడ్డా... స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1975 నుంచి 1977 మధ్య మాత్రమే దేశంలో ప్రజాస్వామ్య పాలన లేదని, ఆ సమయంలో కాంగ్రెస్‌కు చెందిన ఇందిరాగాంధీయే ప్రధానిగా ఉన్నారని నడ్డా విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని