BJP: ఏ క్షణమైనా భాజపా తొలి జాబితా.. అభ్యర్థుల్లో మోదీ, అమిత్‌ షా పేర్లు..!

అగ్రనేతలు మోదీ(Modi), అమిత్‌ షా(Amit Shah) పేర్లు సహా దాదాపు 100 మంది అభ్యర్థుల(Lok Sabha Candidates)తో నేడు భాజపా తొలిజాబితా విడుదల చేయనున్నట్లు సమాచారం. 

Updated : 01 Mar 2024 13:07 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల(Lok Sabha Candidates)ను ఖరారు చేసేందుకు పీఎం మోదీ(PM Modi) సారథ్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) నిర్వహించిన సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము నాలుగింటి వరకు ఈ కమిటీ చర్చలు జరిపింది. ఈ రోజు ఏ క్షణమైనా తొలి జాబితా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ లిస్ట్‌లో మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సహా 100 మంది పేర్లు ప్రకటించనున్నట్లు సమాచారం. చాలామంది సిటింగ్‌ ఎంపీలకే మళ్లీ టికెట్లు దక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఒకవైపు కాంగ్రెస్-ఇండియా కూటమిలోని ఇతర పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు ఇంకా పూర్తికాలేదు. ఈ సమయంలో ఆ కూటమిపై ఒత్తిడి పెంచేందుకు ఎన్నికల తేదీల ప్రకటన వెలువడకముందే కొంతమంది అభ్యర్థుల పేర్లు వెల్లడించాలని భాజపా భావిస్తోంది. ఈ చర్చల్లో యూపీ, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, కేరళ, తెలంగాణలోని స్థానాలపై దృష్టి పెట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇతర రాష్ట్రాల్లో సీట్లపై ప్రాంతీయ పార్టీలతో అంగీకారం కుదిరిన తర్వాత ప్రకటన ఉండొచ్చు.

ఇదిలా ఉంటే.. మోదీ మూడోసారి వారణాసి స్థానం నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 2014లో 3.7 లక్షలు, 2019లో 4.8 లక్షలు మెజార్టీతో ఆయన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సారి ఆయనతో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకా గాంధీ పోటీ పడనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమిత్‌ షా గుజరాత్‌లోని గాంధీనగర్‌ నుంచి బరిలోకి దిగొచ్చని తెలుస్తోంది. అలాగే అమేఠీ స్థానం గురించి ఈ మీటింగ్‌లో చర్చకు వచ్చినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి ఈసారీ స్మృతి ఇరానీ పోటీ చేయనుందని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని