BJP Candidates List: రాజస్థాన్‌ బరిలో ఏడుగురు భాజపా ఎంపీలు.. మధ్యప్రదేశ్‌ సీఎంకు సీటు ఫిక్స్‌

BJP Candidates List: వచ్చే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు భాజపా పక్కా వ్యూహాలను అమలు చేస్తోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో ఎంపీలు, కేంద్రమంత్రులను బరిలోకి దింపగా.. తాజాగా రాజస్థాన్‌లోనూ ఏడుగురు ఎంపీలకు టికెట్లు ఇచ్చింది

Published : 09 Oct 2023 17:31 IST

దిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల (Assembly elections)కు షెడ్యూల్‌ వెలువడింది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం పోలింగ్‌ తేదీలను ప్రకటించింది. ఈ క్రమంలోనే ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు భాజపా మరో విడత అభ్యర్థుల జాబితా (BJP Candidates List)ను విడుదల చేసింది. రాజస్థాన్‌లో తొలి జాబితాను విడుదల చేయగా.. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికలకు మరింత మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

వసుంధరా రాజేకు దక్కని చోటు..

రాజస్థాన్‌ (Rajasthan) అసెంబ్లీ ఎన్నికలకు 41 మంది అభ్యర్థులతో భాజపా సోమవారం తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో ఏడుగురు ఎంపీలకు టికెట్లు కేటాయించింది. జోత్వారా నుంచి ఎంపీ రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌, విద్యాధర్‌ నగర్‌ నుంచి ఎంపీ దియా కుమారి, తిజారా నుంచి ఎంపీ మహంత్‌ బాలక్‌నాథ్, సవాయ్‌ మాధోపూర్‌ నుంచి రాజ్యసభ ఎంపీ కిరోది లాల్‌ మీనాను బరిలోకి దింపింది. అయితే, తొలి జాబితాలో మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే పేరు లేకపోవడం గమనార్హం. రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

నవంబరు 30న తెలంగాణ ఎన్నికలు.. ఐదు రాష్ట్రాలకు షెడ్యూల్‌ విడుదల

బుధ్నీ నుంచే చౌహన్‌ పోటీ..

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహన్‌ (Shivraj Singh Chouhan) పేరును తొలి రెండు జాబితాల్లో ప్రకటించకపోవడంతో ఇటీవల అనేక ఊహాగానాలు వినిపించాయి. వాటికి చెక్‌ పెడుతూ తాజా జాబితాలో ఆయన పోటీని భాజపా ఖరారు చేసింది. తన కంచుకోట బుధ్నీ నుంచే చౌహన్‌ను బరిలోకి దించింది. మధ్యప్రదేశ్‌ ఎన్నికలకు 57 మందితో భాజపా నేడు మూడో జాబితాను ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలుండగా.. తాజా జాబితాలో కలిపి భాజపా ఇప్పటివరకు 135 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

ఛత్తీస్‌గఢ్‌లో 64 స్థానాలకు ఖరారు..

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) అసెంబ్లీ ఎన్నికలు భాజపా 64 మంది అభ్యర్థులతో మరో జాబితాను విడుదల చేసింది. ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌.. రాజ్‌నంద్‌గావ్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలోనూ పలువురు ఎంపీలను పోటీకి దించింది. ఎంపీలు రేణుకా సింగ్‌, గోమతి సాయ్‌ ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. కాగా.. 90 శాసనసభ నియోజకవర్గాలున్న ఛత్తీస్‌గఢ్‌లో భాజపా తొలి విడతలో 21 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు మొత్తం 85 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని