VK singh: ఈ ఎన్నికల్లో పోటీ చేయను.. కేంద్రమంత్రి వీకే సింగ్‌ ప్రకటన

ఈ లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనని కేంద్రమంత్రి వీకే సింగ్‌ స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

Published : 25 Mar 2024 00:10 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నిక (Lok Sabha Elections)ల్లో  తాను పోటీ చేయడంలేదని కేంద్రమంత్రి, ఘజియాబాద్‌ భాజపా ఎంపీ జనరల్‌ వీకే సింగ్‌ (VK Singh) ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్‌ పెట్టారు. ఘజియాబాద్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వీకే సింగ్‌.. ప్రస్తుతం కేంద్ర రవాణాశాఖ సహాయమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే.

‘‘నా జీవితమంతా దేశానికి ఓ సైనికుడిలా సేవ చేసేందుకే అంకితం. ఘజియాబాద్‌ను ఓ ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పదేళ్ల పాటు అవిశ్రాంతంగా కృషిచేశాను. ఈ క్రమంలో యావత్‌ దేశ ప్రజలు, భాజపా సభ్యుల నుంచి ప్రేమ, విశ్వాసాన్ని పొందాను. ఈ బంధం నాకు వెలకట్టలేనిది.  ఇలాంటి తరుణంలో కష్టమైనా సరే.. ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా. 2024 లోక్‌సభ ఎన్నికల్లో నేను పోటీ చేయను. ఈ నిర్ణయం అంత తేలికైనది కాదు.. నా గుండె లోతుల్లోంచి తీసుకున్న నిర్ణయం. నా శక్తి, సమయాన్ని వెచ్చించి ప్రజలకు వేరే మార్గంలో సర్వీసులందించేందుకు కృషిచేస్తాను. ఈ ప్రయాణంలో తమ ప్రేమ, మద్దతును అందించి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు’’ అని వీకే సింగ్‌ పేర్కొన్నారు. 

నాకు పోటీ చేయడం ఇష్టంలేదు.. కాన్పూర్‌ ఎంపీ

ఇదిలా ఉండగా.. యూపీలోని కాన్పూర్‌ సిట్టింగ్‌ ఎంపీ సత్యదేవ్‌ పచౌరి కూడా ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని ప్రకటించారు. ఈ మేరకు ఆయన కూడా ట్వీట్‌ చేశారు. ‘‘2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం నాకు ఇష్టం లేదని మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నా. ఈ నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తెలియ జేశాను. పార్టీకి నమ్మకమైన కార్యకర్తగా, ఇచ్చిన బాధ్యతలను నిర్వహిస్తాను’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని