DK Aruna: రేవంత్‌కు పాలనపై పట్టు లేదు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పాలనపై పట్టు లేదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు.

Published : 25 May 2024 05:07 IST

భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శ

ప్రసంగిస్తున్న డీకే అరుణ. వేదికపై వెంకటరమణారెడ్డి, డా.సమ్మిరెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఏవీఆర్‌రెడ్డి, మురళీమనోహర్, రాంచందర్‌రావు

సుబేదారి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పాలనపై పట్టు లేదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. శుక్రవారం రాత్రి హనుమకొండలో ఓరుగల్లు సిటిజన్‌ ఫోరం కన్వీనర్‌ డాక్టర్‌ సమ్మిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మేధావుల సదస్సుకు ఆమె ప్రత్యేక అతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిన విషయం తెలిసీ ఆచరణ సాధ్యం కాని హామీలు ప్రకటించి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు రేవంత్‌రెడ్డి పూటకో మాటతో కాలయాపన చేస్తున్నారు. మోదీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక భారాస తప్పిదం వల్లే వచ్చాయి. ఇప్పుడు తిరిగి ఆ పార్టీ అభ్యర్థికి ఓటు ఎందుకు వేయాలి..? అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే సమస్యలపై ప్రశ్నించగలరా..? నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలను మండలిలో ప్రశ్నించే భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికే మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలి’ అని కోరారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. మేధావులు మౌనంగా ఉండటం ప్రమాదకరమని, ఎమ్మెల్సీ ఎన్నికల రోజున పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యా విధానాన్ని ప్రభుత్వాలు నాశనం చేశాయని, దీన్ని సరిచేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సదస్సులో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఏబీవీపీ జాతీయ మాజీ అధ్యక్షుడు మురళీమనోహర్‌ పాల్గొన్నారు. 

వర్చువల్‌గా ప్రసంగించిన మధ్యప్రదేశ్‌ సీఎం 

ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరుకావాల్సిన మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌యాదవ్‌ హైదరాబాద్‌కు వచ్చినా అనివార్య కారణాలతో ఇక్కడకు రాలేకపోయారు. దీంతో వర్చువల్‌గా తన సందేశాన్ని ఇచ్చారు. కాంగ్రెస్, భారాస రెండూ అవినీతి, కుటుంబపాలన పార్టీలేనని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని