loksabha polls: కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం

మహారాష్ట్రలోని షోలాపూర్‌ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

Published : 20 Apr 2024 00:11 IST

ముంబయి: మహారాష్ట్రలోని షోలాపూర్‌ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ వ్యక్తి ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. దీనిపై  స్పందించిన భాజపా నేత షెహజాద్ పూనావాలా ఇది కాంగ్రెస్ పార్టీ స్కామ్‌గా అభివర్ణించారు. ఆ వీడియోను పార్టీ అధికారిక ఎక్స్‌లో పోస్టు చేస్తూ ఎన్నికల సంఘానికి, షారుఖ్‌ ఖాన్‌కు ట్యాగ్‌ చేశారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను నిర్మొహమాటంగా, బహిరంగంగా ఎలా మోసం చేస్తుందో చూడండి. నకిలీ సర్వేలు, భారత వ్యతిరేక కథనాలు చేయించారు. ప్రముఖుల డీప్ ఫేక్‌లను రూపొందించారు. ఇప్పుడేమో ఇలా డూప్‌లతో ప్రచారం చేయిస్తున్నారు. అలాంటి ఈ పార్టీ ఈవీఎంలను ఎందుకు నిందిస్తుందో మీకు తెలుసు’’ అంటూ ఓ వ్యాఖ్యను జత చేశారు.

కాగా షారుఖ్‌ఖాన్‌గా కనిపించే డూప్ పేరు ఇబ్రహీం ఖాద్రీ అని నెటిజన్లు పేర్కొన్నారు. ఆయన షారుఖ్ ను పోలి ఉండడంతో సామాజిక మాధ్యమాలలో అతడికి అనేకమంది ఫాలోవర్లు ఉన్నారని తెలిపారు. వైరల్ అవుతున్న వీడియోలో షారుఖ్‌లా కనిపించే ఇబ్రహీం ఖాద్రీ షోలాపూర్‌ అభ్యర్థి ప్రణితి షిండే ఫొటోలతో ముస్తాబు చేసిన ప్రచార వాహనంపై నిల్చొని, తన పోనీటైల్‌ను సవరించుకుంటూ, ప్రజలకు అభివాదం చేస్తూ ఉన్నారు.

ప్రణితి షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే కుమార్తె. షోలాపూర్ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన ఆమె లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. ఇక్కడ మూడో దశలో మే 7న ఎన్నికలు జరగనున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని