Siddaramaiah: మా ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఆఫర్‌ చేశారు: సిద్ధరామయ్య

కర్ణాటకలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు భాజపా రూ.50 కోట్లు ఆఫర్‌ చేసిందని సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు.

Published : 23 Mar 2024 00:06 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) భాజపా (BJP)పై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ (Congress) ఎమ్మెల్యేలను తమ పదవులకు రాజీనామా చేయించి ఉప ఎన్నిక కోసం భాజపా ప్రయత్నిస్తోందన్నారు. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఇవ్వడంతోపాటు ఉప ఎన్నికకు అయ్యే ఖర్చును కూడా భరిస్తామని హామీ ఇస్తోందని విమర్శించారు. ‘ఆపరేషన్‌ కమలం’లో భాగంగా రాష్ట్రంలో భాజపా ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను పావులుగా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు. 

‘‘అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన వారి ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తోంది. అయితే, అలాంటివారు ప్రతిపక్ష పార్టీల్లోనే ఉన్నారా? భాజపాలో ఎవరూ లేరా? గతంలో కూడా కర్ణాటకలో భాజపా ‘ఆపరేషన్‌ కమలం’ చేపట్టింది. మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు భాజపా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. మా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఆఫర్‌ చేశారు. ఇంత డబ్బు వాళ్లకి ఎక్కడినుంచి వచ్చింది? ఇదంతా నల్లధనం కాదా? ప్రజాస్వామ్య సూత్రాలను, పార్లమెంటరీ వ్యవస్థను నాశనం చేసేందుకు భాజపా కుట్ర చేస్తోంది’’ అని సిద్ధరామయ్య ఆరోపించారు.

నవీన్‌ పట్నాయక్‌తో పొత్తు లేనట్లే.. ఒడిశాలో భాజపా ఒంటరిగానే

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్‌ ఖాతాలను భాజపా స్తంభింపచేసిందన్నారు. దేశం కోసం సమస్యలను ఎదుర్కోవడం పార్టీకి, కార్యకర్తలకు కొత్తేమీ కాదన్నారు. ‘‘ఈసారి దేశవ్యాప్తంగా ప్రజలు భాజపాను తిరస్కరించడం ఖాయం. కాంగ్రెస్‌ ఖాతాల్లో ఉన్న డబ్బంతా ప్రజలు పార్టీకి స్వచ్ఛందంగా విరాళాల రూపంలో ఇచ్చిందే. చిన్నపాటి సాంకేతిక కారణాలతో ఖాతాలను సీజ్‌ చేయడం నిరంకుశత్వ ధోరణికి నిదర్శనం. భాజపా విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పోరాటం చేయకూడదని ఆ పార్టీ భావిస్తోంది’’ అని విమర్శించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని