BJP: అభిషేక్‌ Vs అభిజీత్‌.. దీదీ మేనల్లుడికి భాజపా గట్టి పోటీ

BJP: పశ్చిమ బెంగాల్‌లోని డైమండ్‌ హార్బర్‌లో దీదీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీకి పోటీగా భాజపా అభిజీత్‌ దాస్‌ను రంగంలోకి దించింది.

Updated : 16 Apr 2024 14:11 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok sabha Elections)కు 12వ విడత అభ్యర్థుల జాబితాను భాజపా (BJP) మంగళవారం విడుదల చేసింది. నాలుగు రాష్ట్రాల్లోని ఏడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని కీలకమైన డైమండ్‌ హార్బర్‌ స్థానంలో అభిజీత్‌ దాస్‌ అలియాస్‌ బాబీని నిలబెట్టింది.

2009 నుంచి ఇక్కడ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న టీఎంసీ (TMC) నేత అభిషేక్‌ బెనర్జీ (Abhishek Banerjee) వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తున్నారు. ఈసారి బెంగాల్‌ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కమలదళం.. దీదీ మేనల్లుడిని ఎదుర్కొనేందుకు అభిజీత్‌ను రంగంలోకి దింపింది. పార్టీ కార్యకర్తల్లో బాబీగా గుర్తింపు పొందిన ఆయన.. 24 దక్షిణ పరగణాల జిల్లాలో భాజపాకు ముఖ్యనేత. 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో డైమండ్‌ హార్బర్‌ నుంచి అభిషేక్‌ బెనర్జీపై పోటీ చేసి రెండు సార్లు ఓటమి చవిచూశారు. అయినప్పటికీ పార్టీ మరోసారి ఆయనకే టికెట్‌ కేటాయించింది. స్థానికంగా పార్టీని బలోపేతం చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో డైమండ్‌ హార్బర్‌లో ఓటు షేరు పరంగా భాజపా రెండో స్థానంలో నిలిచింది. ఈసారి టీఎంసీ, కమలం మధ్య గట్టి పోటీ ఉండనుంది.

ఆ మూడు చోట్ల ఎవరు?.. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులపై ఉత్కంఠ

బెంగాల్‌తో పాటు మహారాష్ట్ర, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పలు స్థానాలకు భాజపా అభ్యర్థులను ప్రకటించింది.

  • మహారాష్ట్రలోని సతారా నుంచి ఛత్రపతి శివాజీ వారసుడు ఛత్రపతి ఉదయన్‌రాజే భోంస్లేను నిలబెట్టింది.
  • పంజాబ్‌లోని ఖదూర్‌ సాహిబ్‌ నుంచి మంజీత్‌ సింగ్‌ మన్నా మియావింద్‌ను ఖరారు చేసింది.
  • పంజాబ్‌లోని హోషియాపుర్‌ నుంచి కేంద్రమంత్రి సోమ్‌ ప్రకాశ్‌ సతీమణి అనితకు సీటు కేటాయించింది. బఠిండా నుంచి మాజీ ఐఏఎస్‌ పరంపాల్‌ కౌర్‌ సిద్ధూకు టికెట్‌ ఇచ్చింది.
  • ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ నుంచి ఠాకుర్‌ విశ్వదీప్‌ సింగ్‌ను బరిలోకి దించింది. సమాజ్‌వాదీ పార్టీకి మంచి పట్టున్న ఈ స్థానంలో ఎస్పీ నుంచి రామ్‌ గోపాల్ యాదవ్‌ కుమారుడు అక్షయ్‌ పోటీలో ఉన్నారు.
  • ఇక ఇదే రాష్ట్రంలోని దేవరియా నుంచి శశాంక్‌ మణి త్రిపాఠికి టికెట్‌ ఇచ్చింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని