LS Polls: ఆయన సినిమాలపై నిషేధం విధించండి.. ‘ఈసీ’కి భాజపా లేఖ

లోక్‌సభ ఎన్నికల వేళ ప్రముఖ నటుడు శివరాజ్‌కుమార్‌ సినిమాలు, ప్రకటనలు, హోర్డింగ్‌లపై నిషేధం విధించాలని కోరుతూ భాజపా శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించింది.

Published : 22 Mar 2024 20:08 IST

బెంగళూరు: కన్నడనాట లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారం జోరందుకుంది. 2019లో రాష్ట్రంలోని 28 స్థానాల్లో 25 సీట్లను గెలుచుకున్న భాజపా (BJP).. ఈసారి కూడా జైత్రయాత్ర కొనసాగించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల వేళ ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ (Shivarajkumar) సినిమాలు, ప్రకటనలు, హోర్డింగ్‌లపై నిషేధం విధించాలని కోరుతూ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించింది. ఆయన సతీమణి గీతా శివరాజ్‌కుమార్‌ శివమొగ్గలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉన్న విషయం తెలిసిందే.

‘‘శివరాజ్‌కుమార్ రాష్ట్రంలో ప్రజాదరణ కలిగిన వ్యక్తి. ప్రస్తుతం కాంగ్రెస్ కోసం రాష్ట్రవ్యాప్త ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. తనదైన ప్రజావ్యక్తిత్వం, నటించిన సినిమాల ద్వారా ప్రజలపై గణనీయమైన ప్రభావం చూపగలరు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనే ఆయన హక్కును గౌరవిస్తున్నప్పటికీ.. ఎన్నికల్లో అందరికీ సమాన అవకాశాల వేదిక కల్పించాలి. అనవసరమైన ప్రయోజనాలు, ప్రభావాలను అరికట్టడం అవసరం’’ అని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్‌ నేత ఆర్‌.రఘు పేర్కొన్నారు.

విరుదునగర్‌లో ఆసక్తికరపోరు.. నటి రాధికకు పోటీగా ‘కెప్టెన్‌’ తనయుడు

కోడ్‌ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలు ముగిసేవరకు శివరాజ్‌కుమార్‌ సినిమాలు, ప్రకటనలు, హోర్డింగ్‌లను ప్రదర్శించకుండా సినిమా హాళ్లు, టీవీ ఛానెల్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ లేఖను పరిశీలిస్తున్నట్లు కర్ణాటక సీఈవో మనోజ్ కుమార్ మీనా ‘పీటీఐ’ వార్తాసంస్థకు చెప్పారు. ఇదిలాఉండగా.. శివరాజ్‌కుమార్‌ నటించిన చివరి కన్నడ చిత్రం ‘కరటక దమనక’ మార్చి 8న విడుదలైంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న రామ్‌చరణ్‌ సినిమాలోనూ కీలకపాత్ర పోషించనున్నారు. శివమొగ్గలో భాజపా నుంచి మాజీ సీఎం యడియూరప్ప తనయుడు, సిట్టింగ్‌ ఎంపీ బీవై రాఘవేంద్ర పోటీ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని