Virudhunagar: విరుదునగర్‌లో ఆసక్తికరపోరు.. నటి రాధికకు పోటీగా ‘కెప్టెన్‌’ తనయుడు

తమిళనాడు(Tamil Nadu)లోని విరుదునగర్‌ లోక్‌సభ స్థానానికి భాజపా, అన్నాడీఎంకే అభ్యర్థులను ప్రకటించాయి.  

Published : 22 Mar 2024 17:19 IST

చెన్నై: సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. అందులో అభ్యర్థుల ఎంపిక కీలకపాత్ర పోషిస్తుంది. ప్రత్యర్థి అభ్యర్థులకు సమఉజ్జీలను దింపుతున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడులోని విరుదునగర్‌లో పోటీ ఆసక్తికరంగా మారింది.(Lok Sabha elections)

శుక్రవారం భాజపా విరుదునగర్ అభ్యర్థిని ప్రకటించింది. ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్(Radhika Sarathkumar) అక్కడి నుంచి పోటీ చేస్తారని తెలిపింది. ఆ వెంటనే అన్నాడీఎంకే తన పోటీదారుని వెల్లడించింది. పొత్తులో భాగంగా ఆ స్థానం డీఎండీకేకు వెళ్లింది. ఆ పార్టీ నుంచి విజయ ప్రభాకరన్‌ (Vijay Prabakaran) పోటీ చేయనున్నారు. ఆయన డీఎండీకే వ్యవస్థాపకుడు, దివంగత నేత విజయకాంత్(Vijayakanth) కుమారుడు. ఇక పొత్తులో భాగంగా ఆ పార్టీకి ఐదు లోక్‌సభ స్థానాలు దక్కాయి.

భాజపా నాలుగో జాబితా.. విరుదునగర్‌ నుంచి రాధికా శరత్‌ కుమార్‌

2006లో రాధిక రాజకీయ ప్రస్థానం మొదలైంది. తన భర్త శరత్‌కుమార్‌తో కలిసి అన్నాడీఎంకేలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అదే ఏడాది అగ్రనాయకత్వం వారిని తొలగించింది. 2007లో వారు ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చి (AISMK) పార్టీని స్థాపించారు. దానికి ఉపాధ్యక్ష హోదాలో ఆమె సేవలు అందించారు. కొద్దిరోజుల క్రితం ఏఐఎస్‌ఎంకేను భాజపాలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెకు కమలం పార్టీ టికెట్ దక్కింది. ప్రముఖ నటుడు, డీఎండీకే అధ్యక్షుడైన విజయకాంత్‌(Vijayakanth) గత ఏడాది డిసెంబర్‌లో మృతి చెందారు. ఆయన తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని