Odisha CM: బాగానే ఉన్నా.. నా ఆరోగ్యంపై భాజపా అబద్ధాలు చెబుతోంది: నవీన్‌ పట్నాయక్‌

తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నానని ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ అన్నారు. 

Published : 24 May 2024 18:34 IST

భువనేశ్వర్‌: తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నట్లు ఒడిశా సీఎం, బిజూ జనతాదళ్‌ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ స్పష్టంచేశారు.  ఆరోగ్యం, వృద్ధాప్యం కారణంగా నవీన్‌ పట్నాయక్‌కు విశ్రాంతి ఇవ్వాలంటూ ఎన్నికల ప్రచారంలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ప్రజలకు భాజపా చెబుతోన్న అబద్ధాలకు ఓ హద్దు ఉండాలన్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. నెలల తరబడి ఎన్నికల ప్రచారంలో ఉన్నట్లు వెల్లడించారు.  వీడియో సందేశాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వాడుతున్నట్లు కొందరు భాజపా నేతలు చేసిన ఆరోపణలకు కౌంటర్‌ ఇచ్చారు. భాజపా నేతలు  తమ సొంత ఇంటెలిజెన్స్‌ను వాడాలని సూచించారు. 

అనంతరం నవీన్‌ పట్నాయక్‌ సన్నిహితుడు, బిజూ జనతాదళ్‌ నేత వీకే పాండియన్‌ మాట్లాడుతూ.. భాజపా నేతల వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమన్నారు. ప్రజాదరణ కలిగిన ఒక ముఖ్యమంత్రిని కించపరచడాన్ని ఒడిశా ప్రజలు హర్షించరన్నారు. ఒడిశాలో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అవసరమైన మెజార్టీ సాధిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.  సీఎం నవీన్‌ను భాజపా నేతలు దూషించడం.. తమ పార్టీ ఓట్ల శాతం పెరగడానికే పనికొస్తుందని వ్యాఖ్యానించారు. పరిణితి చెందిన మనలాంటి ప్రజాస్వామ్యంలో నేతలు హద్దులు తెలుసుకోవాలన్నారు.  కేవలం ఓట్ల కోసం ప్రజాదరణ కలిగిన గొప్ప నేతలను కించపరిస్తే.. చరిత్ర క్షమించదన్నారు. ఒడిశాలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలపై పాండియన్‌ స్పందిస్తూ..  మొత్తం 147 అసెంబ్లీ సీట్లుండగా.. భాజపా కేవలం 30 సీట్లపైనే ఫోకస్‌ పెట్టిందన్నారు. ఇదే వాళ్ల అంతర్గత టార్గెట్‌ అని చెప్పారు. 2014 నుంచి భాజపా మార్పు గురించి మాట్లాడుతున్నా.. అప్పట్నుంచి ఒడిశాలో నవీన్‌ హవానే కొనసాగుతోందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని