BJP Manifesto: లోక్‌సభ ఎన్నికలు.. రేపే భాజపా మేనిఫెస్టో..!

BJP Manifesto: లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ రేపు (ఏప్రిల్‌ 14) మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Updated : 13 Apr 2024 19:49 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికలు (Lok sabha elections) దగ్గరపడుతున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ తమ మేనిఫెస్టో (Manifesto)ను ప్రకటించగా.. ఇప్పుడు భాజపా (BJP) తమ ‘సంకల్ప పత్రాన్ని’ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.

లోక్‌సభ ఎన్నికలకు కమలదళం తమ మేనిఫెస్టోను ఏప్రిల్‌ 14న (ఆదివారం) విడుదల చేయనున్నట్లు పార్టీకి చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌ తదితరులు ఈ సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నాయి. ‘‘మోదీ గ్యారెంటీ: 2047 నాటికి వికసిత భారత్‌’ థీమ్‌తో మేనిఫెస్టోను రూపొందించినట్లు పార్టీ వర్గాల సమాచారం. అభివృద్ధి, దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా దీన్ని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

మేనిఫెస్టో రూపకల్పన కోసం భాజపా ఇటీవల ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని మొత్తం 27 మంది సభ్యుల కమిటీ.. ఇప్పటికే రెండు కీలక సమావేశాలు నిర్వహించింది. ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించింది. సంకల్ప పత్రం కోసం దాదాపు 15 లక్షల సూచనలు రాగా.. ఇందులో 4 లక్షలకు పైగా అభిప్రాయాలను ప్రజలు నమో యాప్‌ ద్వారా పార్టీతో పంచుకున్నారు. వాటన్నంటిని పరిశీలించిన కమిటీ మేనిఫెస్టోను రూపొందించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఈసారైనా అమృతం దక్కేనా?.. హేమాహేమీలకే దక్కని విజయం

ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ‘న్యాయ పత్రం’ పేరుతో తమ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. 5 న్యాయాలు, 25 గ్యారంటీలను అందులో ప్రకటించింది. ‘మహిళా న్యాయ్‌’ కింద పేద ఇంటి ఆడవారికి ఏటా రూ.లక్ష సాయం, ‘కిసాన్‌ న్యాయ్‌’ కింద రైతులకు రుణమాఫీ, ఎంఎస్‌పీ చట్టం వంటి హామీలు కురిపించింది.

లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు ఏడు విడతల్లో జరగనున్నాయి. దాదాపు 97 కోట్ల మంది ప్రజలు ఇందులో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జూన్‌ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో 400 సీట్లు సాధించి వరుసగా మూడోసారి విజయం సాధిస్తామని ఎన్డీయే ధీమా వ్యక్తం చేస్తోంది. అటు కాంగ్రెస్‌ కూడా మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని విశ్వాసంగా ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని