Himachal Pradesh: ‘ప్రజాతీర్పును అణచివేసే ప్రయత్నం’.. భాజపాపై ప్రియాంక ఫైర్‌

హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రజాతీర్పును అణచివేసేందుకు కేంద్రంలోని భాజపా ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. 

Updated : 28 Feb 2024 18:25 IST

దిల్లీ: ధన బలం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంతో ప్రజల తీర్పును తుంగలోకి తొక్కి, హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో రాజకీయ సంక్షోభం సృష్టించేందుకు భాజపా (BJP) ప్రయత్నిస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన కాంగ్రెస్‌ (Congress) ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేశారు. ఈనేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై ప్రియాంక స్పందించారు. 

‘‘హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలు తమ ఓటుహక్కు ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కానీ, అధికార దుర్వినియోగంతో వారి తీర్పును అణచివేసేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం యత్నిస్తోంది. 25 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ.. 43మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న ప్రభుత్వాన్ని సవాల్‌ చేస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతుందనేందుకు ఇదే నిదర్శనం. ఇది పూర్తిగా అనైతికం, రాజ్యాంగ విరుద్ధం  హిమాచల్‌ ప్రదేశ్‌ సహా దేశవ్యాప్తంగా ప్రజలు భాజపా చర్యలను గమనిస్తున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రజలను ఆదుకోని కేంద్రం ఇప్పుడు రాష్ట్రాన్ని రాజకీయ సంక్షోభంలోకి నెట్టాలని చూస్తోంది’’ అని ప్రియాంక ఆరోపించారు.  

సంక్షోభం వేళ ‘రాజీనామా’ వార్తలు.. స్పందించిన హిమాచల్‌ సీఎం

ఆపరేషన్‌ లోటస్‌ జరగనివ్వం: జైరాం రమేశ్‌

హిమాచల్‌ ప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముగ్గురిని పరిశీలకులుగా నియమించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ (Jairam Ramesh) తెలిపారు. వీరిలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, హరియాణా మాజీ సీఎం భూపీందర్‌ సింగ్ హుడా, ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేష్‌ బఘేల్‌లు ఉన్నారు. ‘‘పార్టీ కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు కాంగ్రెస్ వెనుకాడదు. హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రజాతీర్పునకు ద్రోహం జరగనివ్వం. వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీయే ముఖ్యం. ఆపరేషన్‌ లోటస్‌తో ప్రజా తీర్పుకు భంగం వాటిల్లనివ్వం’’ అని జైరామ్‌ రమేశ్‌ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని