Himachal Crisis: సంక్షోభం వేళ ‘రాజీనామా’ వార్తలు.. స్పందించిన హిమాచల్‌ సీఎం

Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు రాజీనామాకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆయన స్పందించారు.

Updated : 28 Feb 2024 17:50 IST

శిమ్లా: రాజ్యసభ ఎన్నికల్లో జరిగిన క్రాస్‌ ఓటింగ్‌తో హిమాచల్‌ ప్రదేశ్ (Himachal Pradesh) రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యేల తిరుగుబాటు, మంత్రి రాజీనామాతో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు (Sukhvinder Singh Sukhu) సర్కారు సంక్షోభంలో పడింది. దీంతో పదవి నుంచి దిగిపోయేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం తన నిర్ణయాన్ని కాంగ్రెస్‌ (Congress) హైకమాండ్‌కు వెల్లడించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, ఈ వార్తలపై ఆయన స్పందించారు. తాను రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు. పార్టీలో తిరుగుబాటు లేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్‌ సభ్యులు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సుఖు ప్రభుత్వంపై వారు తిరుగుబావుటా ఎగురవేశారు. మరోవైపు రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్‌ రాజీనామా చేయడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని, ప్రభుత్వంలో తాను అవమానకర పరిస్థితులను ఎదుర్కొన్నానని మంత్రి ఆరోపించారు.

క్రాస్‌ఓటింగ్‌ ఎఫెక్ట్‌.. హిమాచల్‌ సీఎంపై ‘అవిశ్వాస’ అస్త్రం..!

అటు, సీఎంపై అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు భాజపా పావులు కదుపుతోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు బుధవారం గవర్నర్‌ను కలిశారు. ఇక, క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన రెబల్ ఎమ్మెల్యేలు ఈ ఉదయం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సీఎం రాజీనామా చేయాలని అంతకుముందు వారు డిమాండ్ చేశారు. ‘‘దీనిపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయం తీసుకోవాలి. సీఎంను మారిస్తే భవిష్యత్తు కార్యాచరణపై పార్టీతో చర్చలు జరుపుతాం. లేదంటే మా దారులు మాకున్నాయి’’ అని ఓ రెబల్‌ ఎమ్మెల్యే వెల్లడించారు.

హిమాచల్‌కు డీకే, భూపిందర్‌ హుడా..

దీంతో పార్టీలో విభేదాలను పరిష్కరించేందుకు హైకమాండ్‌ హుటాహుటిన చర్యలు చేపట్టింది. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, హరియాణా మాజీ సీఎం భూపిందర్‌ సింగ్ హుడాను రాష్ట్రానికి పరిశీలకులుగా రప్పించింది. తాజా పరిస్థితులపై కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని