Lok Sabha polls: భాజపాకు కేరళలో నాలుగైదు సీట్లు వస్తాయ్‌: మెట్రోమ్యాన్‌ వ్యాఖ్యలు

కేరళలో భాజపాకు నాలుగైదు లోక్‌సభ స్థానాలు వస్తాయని మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ అన్నారు.

Published : 24 Mar 2024 18:32 IST

తిరువనంతపురం: సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha elections) ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సారథ్యంలో కేంద్రంలో మరోసారి భాజపా అధికారంలోకి వస్తుందని ‘మెట్రోమ్యాన్‌ ’ శ్రీధరన్‌ (Metroman Sreedharan) విశ్వాసం వ్యక్తంచేశారు. కేరళలోనూ భాజపా(BJP) నాలుగైదు లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటుందన్నారు. ఆదివారం ఆయన తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. త్రిస్సూరు నుంచి సురేశ్‌ గోపీ నూటికి నూరు శాతం గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రులు రాజీవ్‌ చంద్రశేఖర్‌, వి.మురళీధరన్‌లు తిరువనంతపురం, అట్టింగల్‌ నుంచి విజయం సాధిస్తారన్న ఆయన.. అళప్పుళ నుంచి భాజపా నాయకురాలు శోభ సురేంద్రన్‌కు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు.

వైకాపాను వీడి కాంగ్రెస్‌లో చేరిన చింతలపూడి ఎమ్మెల్యే

మెట్రోమ్యాన్‌గా పేరుగాంచిన ప్రముఖ ఇంజినీర్‌ ఇ.శ్రీధరన్‌.. కేరళలో 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  పాలక్కడ్‌ నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్నాళ్లకే క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. పాలక్కడ్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే షఫీ పారంబిల్‌ లోక్‌సభ బరిలో నిలవడంతో ఒకవేళ అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైతే పోటీ చేస్తారా? అని విలేకర్లు అడగ్గా.. తనకు పోటీ చేయాలనే ఆలోచన లేదని శ్రీధరన్‌ తేల్చి చెప్పారు. కేరళలో మొత్తం 20 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్‌ 26న పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని