BJP: టికెట్ ఇచ్చాక.. పోటీ నుంచి వైదొలిగిన భాజపా నేతలు

గుజరాత్‌కు చెందిన ఇద్దరు భాజపా (BJP) నేతలకు అగ్రనాయకత్వం టికెట్లు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. వారు పోటీ నుంచి వైదొలగడమే అందుకు కారణం. 

Updated : 23 Mar 2024 16:00 IST

దిల్లీ: గుజరాత్‌కు చెందిన ఇద్దరు భాజపా(BJP) అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల బరి నుంచి వైదొలిగారు. వ్యక్తిగత కారణాల వల్ల తాము పోటీకి దూరమవుతున్నామని వెల్లడించారు. ఈమేరకు ఎక్స్‌ వేదికగా పోస్టులు పెట్టారు. వడోదర సిట్టింగ్ ఎంపీ రంజన్ భట్‌కు భాజపా మరోసారి టికెట్ ఇచ్చింది. అలాగే సబర్‌కాంతా నుంచి భికాజీ ఠాకూర్‌కు టికెట్ ప్రకటించింది. (Lok Sabha elections)

భట్‌కు మరోసారి టికెట్ ఇవ్వడంపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అందుకు నిరసనగా నియోజకవర్గంలో బ్యానర్లు వెలిశాయి. 2014లో మోదీ.. వారణాసి, వడోదర నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. వారణాసి నుంచి కొనసాగాలని నిర్ణయించుకోవడంతో వడోదర ఖాళీ అయింది. అప్పుడు అక్కడ నిర్వహించిన ఉప ఎన్నికలో భట్ విజయం సాధించింది. 2019లో ఆ గెలుపు పునరావృతమైంది. ఇదిలాఉంటే.. గుజరాత్‌లోని 26 లోక్‌సభ స్థానాలకు ఒకే దశలో మే 7న పోలింగ్‌ జరగనుంది. గత రెండుసార్లు అన్ని సీట్లు కమలం పార్టీ తన ఖాతాలో వేసుకుంది.

కొద్దిరోజుల క్రితం మరో ఇద్దరు నేతలు కూడా ఈతరహా ప్రకటనలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ నియోజకవర్గం నుంచి ఉపేంద్ర సింగ్‌ రావత్‌( Upendra Singh Rawat)ను ఎంపిక చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే.. ఆయనకు చెందిన అభ్యంతరకర వీడియో ఒకటి వైరల్‌ అయింది. అది వివాదాస్పదం కావడంతో పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. దీనికిముందు పశ్చిమబెంగాల్‌లోని అసన్‌సోల్‌ లోక్‌సభ స్థానం నుంచి టికెట్‌ దక్కించుకున్న పవన్‌సింగ్‌.. తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఆయన పాటలు మహిళల్ని అసభ్యకరంగా చిత్రీకరించేలా ఉంటున్నాయనే విమర్శల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయాన్ని వెలువరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని