TDP: మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా

తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని తెదేపా నేత బొండా ఉమా అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated : 20 Apr 2024 12:57 IST

విజయవాడ: తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని తెదేపా నేత బొండా ఉమా అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వంద మంది పోలీసులు శుక్రవారం తన ఆఫీసును చుట్టుముట్టారని చెప్పారు. ఇద్దరు ఏసీపీలు, నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు వచ్చారన్నారు. యుద్ధానికి వచ్చినట్లు విజయవాడ సీపీ తన మీదకు వారిని పంపారని తెలిపారు. సీఎంపై గులకరాయి దాడి జరిగితే మైనర్‌ను తప్పుడు కేసులో ఇరికించి లోపల పెట్టారని చెప్పారు. రిమాండ్‌లో ఉన్న వేముల సతీష్‌ తల్లిదండ్రులను అక్రమంగా నిర్బంధించారని బొండా ఉమా తెలిపారు. 

‘‘డీజీపీ, సీపీ, ఏసీపీ అంతా సిండికేట్‌గా ఏర్పడి తెదేపా అభ్యర్థులపై వేధింపులకు కుట్ర పన్నారు. నేరగాడి చేతిలో కీలుబొమ్మలా పోలీసులు మారిపోవడం దుర్మార్గం. గులక రాయి దాడి కేసు నిందితుడు వేముల సతీష్‌ తల్లిదండ్రులను రెండు రోజుల నుంచి వేధిస్తున్నారు. వడ్డెర గూడెంలో ఉండటమే వేముల దుర్గారావు పాపమా? ఏ సంబంధం లేని అతడిని తీసుకెళ్లి ఎక్కడ దాచారో తెలియదు. తప్పుడు కేసు అంగీకరించాలని అతడితోపాటు మహిళలను చిత్రహింసలు పెడుతున్నారు. గులకరాయి దాడిపై సీబీఐ విచారణ జరపాలని మొదటిరోజే లేఖ రాశాం. ఆరు రోజుల నుంచి దుర్గారావును జడ్జి ఎదుట ఎందుకు హాజరుపరచలేదు? మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు. నా కోసం మొత్తం వడ్డెరగూడేన్ని ఇబ్బంది పెడతారా? తప్పులు చేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదు’’ అని బొండా ఉమా హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని