Kavitha: నా ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించారు: ఎమ్మెల్సీ కవిత

దిల్లీ మద్యం కేసులో తాను బాధితురాలినని.. దీనితో ఎలాంటి సంబంధం లేదని భారాస (BRS) ఎమ్మెల్సీ కవిత (Kavitha) అన్నారు.

Updated : 09 Apr 2024 17:03 IST

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో తాను బాధితురాలినని.. దీనితో ఎలాంటి సంబంధం లేదని భారాస (BRS) ఎమ్మెల్సీ కవిత (Kavitha) అన్నారు. దర్యాప్తు సంస్థలు పేర్కొన్నట్లు ఆర్థికంగా ఏ లబ్ధీ చేకూరలేదని చెప్పారు. జ్యుడిషియల్‌ కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఈడీ అధికారులు ఆమెను కోర్టుకు తీసుకొచ్చారు. ఈ సమయంలో మీడియాతో కవిత పలు వ్యాఖ్యలు చేశారు. 

‘‘సీబీఐ, ఈడీ దర్యాప్తు కంటే మీడియాలో విచారణ ఎక్కువగా జరిగింది. రాజకీయంగా, వ్యక్తిగతంగా నా ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించారు. ఫోన్‌ నంబర్‌ను ఛానళ్లలో ప్రసారం చేసి గోప్యతను దెబ్బతీశారు. దిల్లీ మద్యం కేసులో నాలుగుసార్లు విచారణకు హాజరయ్యా. బ్యాంకు వివరాలు కూడా ఇచ్చి అన్ని విధాలుగా సహకరించా. నా మొబైల్‌ ఫోన్లన్నీ దర్యాప్తు సంస్థకు అందజేశా. ఫోన్లు ధ్వంసం చేశానని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రెండున్నరేళ్లుగా సోదాలు జరిపారు.. వేధింపులకు గురిచేశారు. 

సాక్షులను బెదిరిస్తున్నట్లు నాపై ఆరోపణలు చేస్తున్నారు. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్‌ చేయలేదు. 95 శాతం కేసులన్నీ ప్రతిపక్ష నేతలకు సంబంధించినవే. భాజపాలో చేరిన వెంటనే ఆ కేసుల విచారణ ఆగిపోతోంది. విపక్ష పార్టీలన్నీ న్యాయవ్యవస్థ వైపు ఆశతో చూస్తున్నాయి. కేసు దర్యాప్తునకు సహకరించేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నా’’ అని కవిత అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు