Rahul Gandhi: రైలు టికెట్లు కొనడానికీ మా వద్ద డబ్బుల్లేవ్‌: రాహుల్‌ గాంధీ

Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికల ముందు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేసి దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్‌ అగ్రనేతలు ఆరోపించారు. కేంద్రం చర్యతో కనీసం రైలు టికెట్లు కొనేందుకు కూడా తమ వద్ద డబ్బుల్లేవని రాహుల్‌ గాంధీ తెలిపారు.

Updated : 21 Mar 2024 15:11 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్‌ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తదితరులు గురువారం ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్‌, ఎన్నికల బాండ్ల అంశాలపై నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంలోని ఎన్డీయే సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమ పార్టీని దెబ్బతీసేందుకే ప్రధాని మోదీ తీవ్ర చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల వేళ డబ్బులేకపోవడంతో ప్రచారం చేయలేకపోతున్నామన్నారు.

‘‘కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి పాల్పడుతున్న నేరపూరిత చర్య ఇది. మా బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేశారు. ఈ రోజుల్లో అకౌంట్లు పనిచేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితి. ఎన్నికల వేళ ప్రచారం కోసం ప్రకటనలు ఇవ్వలేకపోతున్నాం. మా నేతలను ఎక్కడికీ పంపించలేకపోతున్నాం. విమాన ప్రయాణాలు పక్కనబెట్టండి.. కనీసం రైలు టికెట్లు కొనడానికీ మా వద్ద డబ్బుల్లేవ్‌’’ అని రాహుల్‌ గాంధీ తెలిపారు.

ఇది కేవలం కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలను ఫ్రీజ్‌ చేయడం కాదని, భారత ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవడమని ఆయన దుయ్యబట్టారు. ‘‘ఈ రోజు దేశంలో ప్రజాస్వామ్యం అనేదే లేకుండా పోయింది. అది అబద్ధంగా మారింది. దేశంలో 20శాతం ఓటర్లు మాకు మద్దతుగా ఉన్నారు. కానీ మేం రెండు రూపాయలు కూడా చెల్లించలేకపోతున్నాం. ఎన్నికల్లో పోరాడకుండా మా సామర్థ్యాన్ని అడ్డుకుంటున్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు’’ అని కేంద్రంపై రాహుల్‌ మండిపడ్డారు.

‘ఇప్పుడు చట్టాన్ని ఆపితే గందరగోళమే’.. ఈసీల నియామకంపై స్టేకు సుప్రీం నిరాకరణ

కాంగ్రెస్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకే: సోనియా

అంతకుముందు సోనియా గాంధీ (Sonia Gandhi) మాట్లాడుతూ ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ‘‘మా బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను బలవంతంగా లాగేసుకుంటున్నారు. కాంగ్రెస్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రధాని మోదీ వ్యవస్థీకృతంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఓవైపు ఎన్నికల బాండ్ల వ్యవహారం.. మరోవైపు దేశంలోని ప్రధాన ప్రతిపక్షం ఆర్థిక లావాదేవీలపై దాడి జరుగుతోంది. ఇన్ని సవాళ్ల నడుమ ఎన్నికల్లో మేం సమర్థంగా ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలంటే తమ బ్యాంకు ఖాతాలను అన్‌ఫ్రీజ్‌ చేయాలని కోరారు. అభ్యర్థులకు ఇచ్చేందుకు డబ్బు లేదన్నారు. సమయం చూసి కాంగ్రెస్‌ను దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా ఎవరు లబ్ది పొందారో దేశం మొత్తానికి తెలుసని మరో కాంగ్రెస్‌ నేత అజయ్‌ మాకెన్‌ ఆరోపించారు. ఇది అత్యంత తీవ్రమైన అంశమని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని