CBI clean chit: మాజీ ప్రధాని మన్మోహన్‌కు భాజపా క్షమాపణ చెప్పాలి - సంజయ్‌ రౌత్‌

కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్‌ పటేల్‌కు సీబీఐ క్లీన్‌ చిట్‌ ఇచ్చిన నేపథ్యంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh)కు భాజపా క్షమాపణలు చెప్పాలని శివసేన (యూబీటీ) డిమాండ్‌ చేసింది.

Published : 30 Mar 2024 00:07 IST

ముంబయి: ఓ అవినీతికి సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్‌ పటేల్‌కు సీబీఐ క్లీన్‌ చిట్‌ ఇవ్వడంపై శివసేన (UBT) స్పందించింది. మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh) ప్రధానిగా ఉన్న సమయంలో పౌర విమానయాన రంగంలో అవినీతి చోటుచేసుకుందని భాజపా హల్‌చల్‌ చేసింది. తాజాగా ఈ కేసును సీబీఐ మూసివేసిన నేపథ్యంలో మన్మోహన్‌కు భాజపా క్షమాపణలు చెప్పాలని శివసేన పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో మహావికాస్‌ అఘాడీ (MVA) కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య అసమ్మతి నెలకొన్నట్లు వస్తోన్న వార్తలపై సంజయ్‌ రౌత్‌ స్పందించారు. సీట్ల పంపకాల విషయంలో పార్టీల మధ్య ఎటువంటి విభేదాలు లేవన్నారు. ఏప్రిల్‌ 3న కూటమి పార్టీలు మీడియా సమావేశం ఏర్పాటుచేయనున్నాయని పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ దిల్లీ రామ్‌లీలా మైదానంలో మార్చి 31న జరిగే బహిరంగ సభలో విపక్ష నేతలతోపాటు ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) పాల్గొంటారని చెప్పారు.

‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్‌ మండిపాటు

ఇదిలాఉంటే, ఎయిరిండియాకు విమానాలను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అప్పటి పౌర విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్‌ పటేల్‌తోపాటు, ఆ శాఖకు సంబంధించిన ముఖ్య అధికారులపై మే 2017లో సీబీఐ కేసు నమోదు చేసింది. దాదాపు ఏడేళ్లపాటు సుదీర్ఘ విచారణ చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. ఈ కేసుతో ప్రఫుల్‌కు సంబంధం లేదని పేర్కొంటూ విచారణను ముగించింది. ప్రఫుల్‌తోపాటు అప్పటి అధికారులకు కూడా క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని