‘భాజపాలో చేరండి లేదా చర్యలు ఎదుర్కోండి’ అని దర్యాప్తు సంస్థలు బెదిరిస్తున్నాయ్‌..: మమత

కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలు చేశారు.

Published : 07 Apr 2024 17:53 IST

పురులియా: లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) విరుచుకుపడ్డారు. తమ పార్టీ నేతల్ని ఆ సంస్థలు భాజపాలో చేరాలని అడుగుతున్నాయని.. లేదంటే చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాయంటూ ఆరోపించారు. ఆదివారం పురులియా జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో దీదీ మాట్లాడారు. సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏ, ఐటీ వంటి సంస్థలు భాజపాకు ఆయుధాలుగా పనిచేస్తున్నాయని విమర్శించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతల్ని వేధించేందుకు ఈ సంస్థలను కేంద్రంలోని భాజపా సర్కార్‌ వాడుకుంటోందన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ సంస్థలు సోదాలు చేస్తూ ఇళ్లలోకి చొరబడుతున్నాయని విమర్శించారు. రాత్రి వేళ అందరూ నిద్రపోతున్న సమయంలో ఎవరైనా తమ ఇంట్లోకి ప్రవేశిస్తే మహిళలు ఏం చేస్తారు? అని ప్రశ్నించారు.

జగన్‌ కుంభకర్ణుడు.. 6నెలల ముందు నిద్రలేచారు: షర్మిల

భూపతినగర్‌లో రెండేళ్ల క్రితం జరిగిన బాంబు పేలుడు ఘటనలో నిందితుల్ని అదుపులోకి తీసుకొనేందుకు శనివారం వెళ్లిన ఎన్‌ఐఏ అధికారుల వాహనంపై స్థానికులు దాడి చేసిన ఘటనను దీదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.  తమ పార్టీ నాయకులు, కార్యకర్తల్ని భాజపాలో చేరాలని, లేదంటే చర్యలను ఎదుర్కోండి అని దర్యాప్తు అధికారులు అడుగుతున్నారని దీదీ ఆరోపించారు. శ్రీరామ నవమి వేడుకల వేళ భాజపా రెచ్చగొట్టే ప్రయత్నాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ఇప్పటివరకూ ఉపాధిహామీ పథకం, పీఎం ఆవాస్‌ యోజనకు సంబంధించిన నిధుల్ని కేంద్రం ఇవ్వడంలేదని మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని