Lok Sabha Elections: కంగనాపై అనుచిత వ్యాఖ్యలు.. హిమాచల్‌కే అవమానకరం: మోదీ

కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలు మండీ, హిమాచల్‌కే అవమానకరమని, దీనికి ఓటర్లు తగిన సమాధానం చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Updated : 24 May 2024 18:36 IST

మండీ: అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలన్న తీర్మానాన్ని భాజపా జాతీయ కార్యవర్గం 1989లో హిమాచల్‌ప్రదేశ్‌లోనే ఆమోదించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గుర్తు చేశారు. రామమందిర నిర్మాణానికి ఇది సంకల్పభూమి అని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో మండీలో నిర్వహించిన ప్రచార సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. స్థానిక భాజపా అభ్యర్థి కంగనా రనౌత్ (Kangana Ranut).. యువత, ఆడబిడ్డల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. ఆమెపై కాంగ్రెస్ నేతలు ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు మండి, హిమాచల్‌కే అవమానకరమని, దీనికి ఓటర్లు తగిన సమాధానం చెప్పాలన్నారు. కంగనా మీ గొంతుకగా మారతారని, మండి అభివృద్ధికి పాటుపడతారని హామీ ఇచ్చారు.

అది ఒకప్పుడు మా దేశమే అని చెప్పా..: పాక్‌ పర్యటనపై మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

గత ఏడాది భారీ వరదలతో హిమాచల్‌ప్రదేశ్‌ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం విడుదల చేసిన నిధులను అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంపిక చేసిన కొద్దిమందికే పంచిపెట్టిందని, మిగతా డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో తాము అధికారంలోకి వచ్చాక వెలికితీస్తామని మోదీ హామీ ఇచ్చారు. అంతకుముందు నహాన్‌లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు స‌రిహ‌ద్దు వెంబడి జీవిస్తున్నార‌ని, వారికి శక్తిసంపన్న దేశం విలువ తెలుసని అన్నారు. పేపర్‌ లీక్‌ కారణంగా ‘హిమాచల్‌ప్రదేశ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (హెచ్‌పీఎస్‌ఎస్‌సీ)’ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ఇక్కడి ‘తలాబాజ్ సర్కార్’ యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి బదులు కమిషన్‌కు తాళం వేసిందని విమర్శలు గుప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని