PM Modi: అది ఒకప్పుడు మా దేశమే అని చెప్పా..: పాక్‌ పర్యటనపై మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

PM Modi: పాక్‌ ఒకప్పుడు మన దేశంలో భాగమేనని, అందుకే వీసా లేకుండానే అక్కడికి వెళ్లాలని ప్రధాని మోదీ అన్నారు. 2015లో లాహోర్‌ ఆకస్మిక పర్యటనకు వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.

Published : 24 May 2024 14:46 IST

దిల్లీ: దాయాది పాకిస్థాన్‌ ఆందోళనలకు ప్రధాన కారణం తానేనని అన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi). ఆ దేశం ఎంత శక్తిమంతమైందో తాను స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించానని అన్నారు. ఈసందర్భంగా పొరుగుదేశాన్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ (Congress) నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

పాక్‌ (Pakistan) వద్ద అణుబాంబులు ఉన్నాయని, ఆ దేశాన్ని భారత్‌ గౌరవించాలంటూ ఇటీవల కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యవహారంపై మోదీ (PM Modi) మరోసారి స్పందించారు. ఈసందర్భంగా 2015లో తన లాహోర్‌ పర్యటన (Lahore Visit)ను గుర్తుచేసుకున్నారు.

‘‘నేను వ్యక్తిగతంగా పాకిస్థాన్‌ వెళ్లి ఆ దేశం ఎంత శక్తిమంతమైందో పరిశీలించాను. నేను లాహోర్‌లో పర్యటించినప్పుడు ఓ జర్నలిస్టు మాట్లాడుతూ.. వీసా లేకుండా తమ దేశానికి ఎలా వచ్చానని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ‘ఒకానొక సమయంలో ఇది మా భారత్‌లో భాగమే కదా’ అని అప్పుడు నేను వారితో అన్నాను. ఈ మధ్య పాక్‌ ప్రభుత్వం ఆందోళనలో ఉంది. దానికి నేను కూడా ఓ మూలకారణమని నాకు తెలుసు. వారు ఆందోళన చేయడంలో అర్థం ఉంది. కానీ, మన దేశంలోనూ కొంతమంది వ్యక్తులు (కాంగ్రెస్‌ నేతలను ఉద్దేశిస్తూ) దాయాదిపై సానుభూతి చూపిస్తున్నారు. ముంబయి పేలుళ్లకు పాల్పడిన కసబ్‌ మనవాడేనంటూ మరో నేత అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు విన్నప్పుడు సిగ్గుతో తల కొట్టేసినట్లు అవుతుంది’’ అని మోదీ హస్తం పార్టీపై విమర్శలు గుప్పించారు.

పాలు పిండకముందే.. నెయ్యి కోసం గొడవ

ఇక, నిన్న పంజాబ్‌లోని పటియాలా సభలో ప్రధాని మాట్లాడుతూ.. కర్తార్‌పుర్‌ సాహిబ్‌ గురుద్వారాపై వ్యాఖ్యలు చేశారు. 1971 యుద్ధంలో 90,000 మందికి పైగా పాక్‌ సైనికులు భారత్‌కు లొంగిపోయారని, అప్పుడు తాను అధికారంలో ఉండి ఉంటే ఆ సైనికులను విడుదల చేసే ముందు పాక్‌ నుంచి కర్తార్‌పుర్‌ సాహిబ్‌ను వెనక్కి తీసుకునేవాడినని మోదీ అన్నారు.

2015 డిసెంబరు 25న అఫ్గానిస్థాన్‌ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ తిరిగొస్తూ లాహోర్‌లో ఆకస్మికంగా దిగిన సంగతి తెలిసిందే. ఆ రోజు నాటి ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పుట్టినరోజు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 2004 తర్వాత ఓ భారత ప్రధాని దాయాది దేశంలో అడుగుపెట్టడం అదే తొలిసారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని