Chandra babu: రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటి?: చంద్రబాబు

రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటని ఏపీ ప్రభుత్వాన్ని తెదేపా అధినేత చంద్రబాబు ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ప్రశ్నించారు.

Updated : 03 Mar 2024 13:52 IST

అమరావతి: రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటని సీఎం జగన్‌ను తెదేపా అధినేత చంద్రబాబు ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ప్రశ్నించారు. ఇది రాష్ట్రానికి అవమానకరమని విమర్శించారు. ‘రూ.370 కోట్లకు రాష్ట్ర పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టడమేంటి? జగన్‌ తాకట్టు పెట్టింది భవనాలను కాదు.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని. ముఖ్యమంత్రి సమున్నతమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను నాశనం చేశారు. అసమర్థ, అహంకార పాలనలో ఏం కోల్పోతున్నామో ఆలోచించాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు. 

ఇంతకంటే దిగజారలేరు అనుకున్న ప్రతిసారీ మరో మెట్టు దిగుతున్నారు: లోకేశ్‌ 

గత ఐదేళ్లుగా జగన్ తెస్తున్న అప్పులను చూసి తలపండిన ఆర్థికవేత్తలకు సైతం మైండ్ బ్లాంక్ అవుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని రూ.12.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన జగన్‌.. ఇప్పుడు ఏకంగా సచివాలయాన్ని తాకట్టుపెట్టారన్న వార్త చూసి షాక్‌కు గురైనట్లు తెలిపారు. ‘‘ఏపీని అప్పుల కుప్పగా చేసి మరో శ్రీలంకలా మార్చేస్తున్నారని మేమంటే ఒంటికాలిపై లేచిన వైకాపా మేధావులు దీనికేం సమాధానం చెబుతారు? ఏపీ సచివాలయాన్ని రూ.370 కోట్లకు తాకట్టుపెట్టిన జగన్ పనితనాన్ని చూశాక ఆ దేశంతో పోల్చడం ఏ మాత్రం సరికాదని అనిపిస్తోంది. ఎంత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా శ్రీలంక తమ పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టలేదు. ఇంతకంటే దిగజారలేరు అనుకున్న ప్రతిసారీ మరో మెట్టు దిగిపోతూ రాష్ట్ర పరువును మంటగలుపుతున్న ఈ ముఖ్యమంత్రిని ఏమనాలో.. ఎవరితో పోల్చాలో మాటలు రావడం లేదు’’ అని నారా లోకేశ్‌ అన్నారు.

జీఎంసీ బాలయోగికి చంద్రబాబు నివాళి

లోక్‌సభ మాజీ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. ఒక సాధారణ దళిత రైతు కుటుంబంలో పుట్టి.. లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేసిన ఘనతను బాలయోగి సాధించారని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన సేవలందించారని.. కోనసీమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని