Chandra babu: తెలిసింది కొంతే.. తెలియాల్సింది కొండంత

ఐదేళ్ల అరాచక పాలనలో వైకాపా ప్రభుత్వం ఎన్నెన్ని కుంభకోణాలు చేసిందో, ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేసిందో లోతుల్లోకి వెళ్లి చూస్తేగానీ తెలియదని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.

Updated : 06 Jun 2024 06:59 IST

వైకాపా ప్రభుత్వ అరాచకాలపై మీడియాకి, మాకు తెలిసింది తక్కువే
వైకాపా ప్రభుత్వంలో ఎన్ని కుంభకోణాలు జరిగాయో.. లోతుల్లోకి వెళ్లి శోధించాలి
ఎన్ని అప్పులు తెచ్చారో.. ఎక్కణ్నుంచి తెచ్చారో తెలియదు
జగన్‌ విధ్వంసం చేసిన వ్యవస్థలన్నింటినీ గాడిన పెడతాం
సంబంధం లేని వ్యవస్థతో  అప్పులు తెచ్చి ఖర్చు చేశారు
రాక్షస పాలన అంతమవడంతో ప్రజలకు స్వేచ్ఛ లభించింది
తెదేపా అధినేత చంద్రబాబు వెల్లడి
కూటమి విజయం అనంతరం తొలిసారి విలేకర్ల సమావేశం

ఉండవల్లిలోని నివాసంలో విలేకర్లతో మాట్లాడుతున్న తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు, అమరావతి: ఐదేళ్ల అరాచక పాలనలో వైకాపా ప్రభుత్వం ఎన్నెన్ని కుంభకోణాలు చేసిందో, ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేసిందో లోతుల్లోకి వెళ్లి చూస్తేగానీ తెలియదని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. జగన్‌ ప్రభుత్వ కుంభకోణాలపై మీడియాకు, విపక్షాలకు తెలిసింది పైపైన మాత్రమేనని, అసలు విషయం లోతుల్లోకి వెళ్లి శోధిస్తేనే అర్థమవుతుందని అన్నారు. దీనికి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక నాలుగైదు రోజుల సమయం పడుతుందన్నారు. వైకాపా రాక్షస పాలన అంతమవడంతో మీడియాకు ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లభించాయని ఆయన వ్యాఖ్యానించారు. జగన్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ ధ్వంసం చేసిందన్నారు. ‘30 ఏళ్లకు సరిపడా విధ్వంసం ఈ ఐదేళ్లలోనే జరిగింది. వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అప్పులు ఎంత చేశారో.. ఎక్కడెక్కడ చేశారో.. ఏయే పేర్లతో చేశారో లోతుల్లోకి వెళితే గానీ తెలియదు. సంబంధంలేని వ్యవస్థతో డబ్బులు తెచ్చి.. సంబంధంలేని మరో విభాగానికిచ్చారు. జగన్‌ ప్రభుత్వ అరాచకాలు, కుంభకోణాలు, ఆర్థిక అవకతవకలపై ఇన్నాళ్లూ మీరు పత్రికల్లో రాసినవి.. మేం మాట్లాడిందీ చాలా తక్కువ. లోతుల్లోకి వెళితేనే వాళ్లు చేసిన కుంభకోణాలన్నీ బయటకు వస్తాయి’ అని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి అసాధారణ విజయం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు బుధవారం తొలిసారి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

వాళ్లకు అడ్డే లేదన్నట్టుగా చెలరేగిపోయారు 

‘ఐదేళ్లపాటు వైకాపా నాయకులు ఎక్కడికక్కడ సహజ సంపదను కొల్లగొట్టారు. గనులు, ఇసుక, మట్టి.. ఇలా కనపడిందల్లా దోచుకున్నారు. వారికి అడ్డే లేదన్నట్టుగా, ఎవరైనా అడ్డొస్తే తొలగించుకుంటూ పోతామన్న ధీమాతో చెలరేగిపోయారు. ఒక రైతు పొలం పక్కనున్న ఇసుక తవ్వేసి.. భూగర్భజలాలు అడుగంటేలా చేస్తే, సాగుకు నీరులేక ఆ రైతు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూశాను. కానీ ఆ రైతు మాట్లాడే సాహసం చేయలేకపోయారు. కళ్ల ముందు పొలంలోని మట్టి తీసుకెళుతుంటే ఎదిరించలేని నిస్సహాయ స్థితి. ఇలా చాలా జరిగాయి. ఆ వ్యవస్థలన్నింటినీ పునరుద్ధరించాల్సిన బాధ్యత మాపై ఉంది. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. మేం అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థల్ని బాగు చేస్తే.. మా తర్వాత వచ్చినవాళ్లు వాటిని నాశనం చేశారు. మళ్లీ వాటిని గాడిన పెట్టడం ఎంత కష్టమో నాకు తెలుసు. 1999 నుంచి విద్యుత్‌ సంస్కరణలు అమలు చేసి 2004 నాటికి మిగులు విద్యుత్‌ సాధించాం. మళ్లీ 2014 నాటికి 22 మిలియన్‌ యూనిట్ల కొరత ఏర్పడింది. 2014లో మేం అధికారంలోకి వచ్చాక మళ్లీ వ్యవస్థల్ని గాడినపెట్టి, సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేయించి, విద్యుత్‌ ధరలు తగ్గించాం. వైకాపా అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో తొమ్మిదిసార్లు కరెంటు ఛార్జీలు పెంచింది. ఎందుకు పెంచారో తెలియదు. అవన్నీ తవ్వడం మొదలుపెడితే ఎంత లోతుకు వెళ్లాల్సి వస్తుందో తెలియదు. పాలకులు ఎలా ఉండకూడదో ప్రపంచానికి చాటిచెప్పి జగన్‌ ఒక ‘కేస్‌ స్టడీ’గా మిగిలారు. ఒక వ్యక్తిని ఓడించాలని ఓటేయడం సహజం.. కానీ అసలు నవ్వు మాకు వద్దే వద్దని ఓటు వేయడం అరుదు. 

ప్రజలు మాకు ఇచ్చింది అధికారం కాదు... బాధ్యత 

ప్రజలు మాకు ఇచ్చింది అధికారం కాదు. అపారమైన నమ్మకంతో అప్పగించిన బాధ్యత. పాలకుల్లా కాకుండా, ప్రజలకు సేవకుల్లా పనిచేస్తాం. ఐదేళ్ల వైకాపా అరాచక పాలనలో ధ్వంసం చేసిన వ్యవస్థలన్నింటినీ గాడిన పెడతాం. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు మేలిబాటలు పరుస్తాం. ప్రజలకు మెరుగైన దారి చూపిస్తాం. 

విధ్వంసకారులు ఎవరికైనా ఇదే శాస్తి

అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనంతో ఏదంటే అది చేస్తానంటే ప్రజలు క్షమించరు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పే దానికి నిదర్శనం. ఈ గుణపాఠం వైకాపా నాయకులకు మాత్రమే కాదు. అవినీతి, అహంకారంతో రెచ్చిపోయే విధ్వంసకారులెవరికైనా ఇదే శాస్తి జరుగుతుందని ప్రజలు నిరూపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసిన ఇలాంటి ప్రభుత్వాన్ని నా రాజకీయ జీవితంలో చూడలేదు. ఇవి నాకు పదో ఎన్నికలు. రాజకీయాల్లో ఒడుదొడుకులు సహజం. అధికారం అశాశ్వతం. ప్రజాస్వామ్యమే శాశ్వతం. సక్రమంగా ఉంటేనే ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే వ్యక్తులైనా, పార్టీలైనా కనుమరుగవక తప్పదు. 

మీడియానూ వేధించిన జగన్‌ 

జగన్‌ ప్రభుత్వ పెద్దలు మీడియాను అనేక ఇబ్బందులు పెట్టారు. అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పారు. మీడియా ప్రతినిధుల్ని సీఐడీ ఆఫీసులో పెట్టి వేధించారు. యాజమాన్యాలపైనా వేధింపులకు పాల్పడ్డారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖకు వెళితే ఉన్నపళంగా నగరం విడిచివెళ్లాలని హుకుం జారీ చేశారు. ఒక పార్టీ అధ్యక్షుణ్నే నగరం నుంచి బహిష్కరిస్తే సామాన్యుల పరిస్థితేంటి? అక్రమ కేసులు బనాయించారు. కారణం అడిగితే.. ముందు అరెస్ట్‌ చేస్తాం, ఆ తర్వాత వివరాలు చెబుతామన్నట్టుగా పోలీసులు చెలరేగిపోయారు. 

ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓటేసినవారికి వందనం

దేశవిదేశాల నుంచి ప్రజలు వెల్లువలా కదలివచ్చి ఓట్లు వేసిన.. ఇలాంటి చరిత్రాత్మక ఎన్నికల్ని ఎప్పుడూ చూడలేదు. ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తులు రూ.5-10 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓట్లు వేశారు. పొట్ట చేతపట్టుకుని పొరుగు రాష్ట్రానికి వెళ్లి కూలి పనులు చేసుకుంటున్న వ్యక్తులు సొంత ఖర్చులు పెట్టుకుని, భోజనం కట్టుకుని తెచ్చుకుని బాధ్యతగా ఓట్లు వేసి వెళ్లారు. వారి నిబద్ధతను ఎలా వర్ణించాలో, ఎలా అభినందించాలో తెలియడం లేదు. 

అసాధారణ విజయం ఇది

ఇది రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక. తెదేపా ఆవిర్భావం తర్వాత 1983లో జరిగిన తొలి ఎన్నికల్లో 200 సీట్లు సాధించింది. 1994లో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఫలితంగా... ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థాయిలో తెదేపాకు విజయం కట్టబెట్టారు. ఈ విజయం వాటన్నిటికంటే అసాధారణమైంది. కూటమికి 55.38 శాతం ఓట్లు వచ్చాయి. తెదేపాకి 45.60 శాతం, వైకాపాకు 39.37 శాతం ఓట్లు పడ్డాయి. ఒకప్పుడు ఎంఐఎంకి కంచుకోట వంటి చార్మినార్‌ నియోజకవర్గంలో ఆ పార్టీకి అత్యధిక మెజారిటీ వచ్చేది. కుప్పం, సిద్దిపేట మెజారిటీలు కూడా 60-70 వేలు ఉండేవి. కానీ వాటన్నిటినీ మరిపించేలా ఈ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులు మంగళగిరి, గాజువాక, భీమిలి నియోజకవర్గాల్లో 90 వేలకుపైగా ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. 

మమ్మల్ని నడిపించే బాధ్యత ప్రజలదే!

ఓటు వేసేశాం కాబట్టి బాధ్యత పూర్తయినట్టుగా ప్రజలు భావించొద్దు. మమ్మల్ని నడిపించే, మాకు సహకరించే బాధ్యత ప్రజలదే. రాష్ట్రంలోని ప్రజలంతా బాగుపడాలంటే ఏం చేయాలో ఎప్పటికప్పుడు చెబుతూ ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత వారు తీసుకోవాలి. 

ఎన్డీయే సమావేశానికి వెళుతున్నా

సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న నేతగా దేశంలో చాలా రాజకీయ పరిణామాలు చూశాను. మేం ఎన్డీయేలోనే ఉన్నాం. ఈ రోజు జరగబోయే ఎన్డీయే సమావేశానికి హాజరవుతున్నా’ అని చంద్రబాబు చెప్పారు.


కూటమికి బీజం వేసింది పవనే 

తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తల సమష్టి కృషి వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీల్లేదని.. ప్రజాస్వామ్యాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని పవన్‌ కల్యాణ్‌ ముందుకొచ్చి కూటమికి బీజం వేశారు. భాజపా కూడా కూటమిలో భాగస్వామి అయ్యాక... ముగ్గురిలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అన్న తేడాలు, భేషజాల్లేకుండా కలసి పనిచేశాం. భాజపా అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్‌షా మొదలు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఇతర నాయకులు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సహా అందరూ... ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలన్న స్ఫూర్తితో పనిచేశాం. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ సీట్లలో ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేసినా, అన్నీ మూడు పార్టీలవిగా భావించాం. సూపర్‌సిక్స్, మ్యానిఫెస్టోలో మేం ఇచ్చిన హామీలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. వారికి భవిష్యత్తుపై ఆశ చిగురించింది. అందుకే అసాధారణ విజయం సాధించాం. మోదీ, అమిత్‌షా, పురందేశ్వరి, ఆ పార్టీ పరిశీలకులు, పవన్‌ కల్యాణ్‌లకు నా మనఃపూర్వక అభినందనలు.


నా ప్రతిజ్ఞ నెరవేర్చిన జనం రుణం తీర్చుకుంటా

అసెంబ్లీలో నా భార్యకు జరిగిన అవమానాన్ని జీవితంలో మర్చిపోలేను. నా మీద క్లెమోర్‌మైన్స్‌తో దాడి చేసినప్పుడూ వీరోచితంగా ఎదుర్కొన్నాను. కానీ అసెంబ్లీలో నా భార్యను అవమానించేలా వైకాపా సభ్యులు వ్యాఖ్యలు చేశాక... అలాంటి కౌరవ సభలో ఉండనని చెప్పి బయటకు వచ్చేశాను. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ చేశాకే, ముఖ్యమంత్రిగా సభలో అడుగుపెడతానని చెప్పాను. ఆ ప్రతిజ్ఞను సాకారం చేయడానికి ప్రజలు సహకరించారు. ఇది మామూలు సహకారం కాదు. ఇన్నేళ్లలో నేను చాలా ఎన్నికల్లో గెలిచాను. కొన్నిసార్లు ఓడిపోయాను. కానీ ఓటమికి కుంగిపోలేదు. గెలిచినప్పుడు గంతులు వేయలేదు. ఎప్పుడూ ప్రజల పక్షానే ఉన్నాం. కానీ నేను అసెంబ్లీలో చేసిన ప్రతిజ్ఞను సాకారం చేసి మళ్లీ సభకు వెళ్లడం ఒక తృప్తి, గౌరవం. దానికి సహకరించిన ప్రజల రుణం తీర్చుకుంటాను. 


ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి

ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలన్నదే మా ధ్యేయం. భావితరాల భవిష్యత్తు కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడ్డాం. ఐదేళ్లపాటు మా కార్యకర్తల్లో చాలా మంది కంటి మీద కునుకులేకుండా గడిపారు. తీవ్రస్థాయిలో వేధింపులు, అక్రమ కేసులు, హింసాకాండను ఎదుర్కొన్నారు. పల్నాడు జిల్లాలో చంద్రయ్య అనే మా పార్టీ నాయకుణ్ని జై జగన్‌ అంటే చంపకుండా వదిలేస్తామని వైకాపా గూండాలు చెప్పినా.. జై తెదేపా, జై చంద్రబాబు అని నినదించి వారి చేతుల్లో ప్రాణాలు వదిలేశారు. అలాంటి నిబద్ధత గల కార్యకర్తల అసాధారణ త్యాగాలతోనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగాం.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని