ChandraBabu: జగన్‌ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు

తమది విజన్‌.. జగన్‌ది పాయిజన్‌ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు.

Updated : 29 Mar 2024 14:31 IST

బనగానపల్లె: తమది విజన్‌.. జగన్‌ది పాయిజన్‌ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన పనిదొంగ, దోపిడీదారుడని వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. భావితరాల భవిష్యత్తు కోసమే భాజపా, జనసేనతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. 

‘‘మొన్నటివరకు పరదాల చాటున జగన్‌ తిరిగారు. ఇప్పుడు జనాల్లోకి వస్తే వారు పారిపోతున్నారు. వివేకా హత్య కేసులో చెల్లిని జైలుకు పంపాలని చూస్తున్నారు. ఎన్నికల్లో సానుభూతి కోసం గతంలో కోడికత్తి డ్రామా ఆడారు. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి డబ్బులన్నీ కంటెయినర్‌లో తరలిపోతున్నాయి. మద్యం, ఇసుకలో మెక్కిన డబ్బుతో ఓట్లు కొనాలని అనుకుంటున్నారు. ఎవరో కట్టిన దానికి జగన్‌ రిబ్బన్‌ కటింగ్‌ చేస్తారు. మూడు రాజధానులు చేశానని ఆయన చెబుతున్నారు.. కర్నూలు న్యాయ రాజధాని అయిందా? వైకాపా పాలనలో అన్ని వర్గాలూ నష్టపోయాయి. మహిళలకు రక్షణ లేకుండా పోయింది

జగన్‌ 102 ప్రాజెక్టులను రద్దు చేశారు. నేను రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టి  ప్రాజెక్టులను పరుగెత్తించా. వైకాపా ప్రభుత్వం ఖర్చుపెట్టింది రూ.2 వేల కోట్లు మాత్రమే. జాబ్‌ క్యాలెండర్‌ అంటూ యువతను మోసం చేశారు. నోటిఫికేషన్‌ ఇవ్వకుండా నిరుద్యోగులను నిలువునా ముంచారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. జగన్‌.. రాయలసీమ ద్రోహి. ఇక్కడి బిడ్డగా చెబుతున్నా నన్ను నమ్మండి. మిమ్మల్ని అన్నివిధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. సంపద సృష్టించి, ఆదాయాన్ని పెంచి మీకు పంచుతా. జగన్‌ మాదిరిగా రూ.10 ఇచ్చి రూ.100 దోచుకోను.

వాలంటీర్‌ వ్యవస్థను తొలగించను

ఆడబిడ్డ సంక్షేమ నిధి కింద ఒక్కొక్కరికి నెలకు రూ.1500 ఇస్తాం. తెదేపా హయాంలో 12 డీఎస్సీలు పెడితే.. జగన్‌ ఒక్క డీఎస్సీ పెట్టలేదు. ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పగలరా? తెదేపా కూటమి అధికారంలో వచ్చాక రూ.4 వేల పింఛన్‌కు శ్రీకారం చుడతాం. వాలంటీర్‌ వ్యవస్థను నేను తొలగించను. వారిలో విద్యావంతులకు రూ.5 వేల కంటే ఎక్కువ ఇచ్చే మార్గం చూపిస్తా. తప్పుడు కేసులు పెట్టిన వాళ్లకు చక్రవడ్డీతో సహా రుణం తీర్చేస్తాం.’’ అని చంద్రబాబు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని