Chandrababu: సీఎంపై రాయి దాడి ఘటనలో బొండా ఉమాను ఇరికించే కుట్ర: చంద్రబాబు

సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనలో నీచమైన డ్రామాలతో అధికార పార్టీ అభాసుపాలైందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో తమ నేతలపై వైకాపా కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

Updated : 17 Apr 2024 15:02 IST

అమరావతి: సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనలో నీచమైన డ్రామాలతో అధికార పార్టీ అభాసుపాలైందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో తమ నేతలపై వైకాపా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాను ఇరికించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. హత్యాయత్నం అంటూ తెదేపాపై బురద చల్లాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుండటంతో కుట్రలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రయత్నాలను ప్రజలు ఛీత్కరిస్తున్నారని చెప్పారు. నాలుగు రోజులైనా ఈ ఘటనపై పోలీసులు ప్రకటన చేయలేదని చంద్రబాబు అన్నారు.

‘‘నిందితులంటూ వడ్డెర కాలనీ యువకులను తీసుకుపోయారు. తెదేపా నేతల ప్రోద్బలంతోనే దాడి జరిగిందని చెప్పించడానికి యత్నిస్తున్నారు. పోలీసు శాఖతో ప్రభుత్వం తప్పులు చేయిస్తోంది. బొండా ఉమా ప్రచారాన్ని తప్పుడు కేసులతో అడ్డుకోవాలని యత్నిస్తున్నారు. అలా జరిగితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శిక్షిస్తాం. కొందరు అధికారుల చట్ట వ్యతిరేక పోకడలను సహించే ప్రసక్తే లేదు. అధికార పార్టీ ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగవద్దు. అధికార దుర్వినియోగంపై ఎన్నికల సంఘం కూడా దృష్టి పెట్టాలి. సీఎంకు భద్రత కల్పించడంలో విఫలమైన వారిని ఈ కేసు విచారణ బాధ్యతల నుంచి తప్పించాలి. ఈసీ పర్యవేక్షణలోనే వేరే అధికారులతో సమగ్ర విచారణ చేపట్టాలి’’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని