Chandrababu: ఇకపై మారిన చంద్రబాబును చూస్తారు: ఎంపీల సమావేశంలో తెదేపా అధినేత

ఎన్నికల్లో గెలుపొందిన తెదేపా ఎంపీలతో ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ అధినేత, కాబోయే సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.

Updated : 06 Jun 2024 19:28 IST

అమరావతి: ఎన్నికల్లో గెలుపొందిన తెదేపా ఎంపీలతో పార్టీ అధినేత, కాబోయే సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్రంలో మంత్రివర్గ కూర్పు.. తెదేపాకు ఉన్న ప్రాధాన్యం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో విహరించొద్దని గెలిచిన ఎంపీలకు స్పష్టం చేశారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలని సూచించారు. 

‘‘ఇకపై మీరు మారిన చంద్రబాబును చూస్తారు. బ్యూరోక్రాట్స్‌ పాలన ఎంతమాత్రం ఉండదు. చంద్రబాబు మారరు అనే అపవాదు నాపై ఉంది. ఇకపై అలా ఉండదు.. మీరే ప్రత్యక్షంగా చూస్తారు. ఎంపీలందరూ తరచూ వచ్చి కలవండి. నేను బిజీగా ఉన్నా కూడా మీతో మాట్లాడుతా. నాకోసం ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు ప్రాణాలిచ్చారు. కత్తి.. మీద పెట్టినా జై తెదేపా, జై చంద్రబాబు అన్నారు. అధికార పార్టీ ఒత్తిడికి ఎవరూ తలొగ్గలేదు. ప్రతి అంశాన్ని నేనే వింటా.. నేనే చూస్తా. ఇకపై రాజకీయ పాలన ఉంటుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కలిసి పనిచేయాలి. అందరూ ఎవరి పరిధిలో వారు పనిచేయాలి. ఈ ఐదేళ్లు కార్యకర్తల ఇబ్బందులు మనోవేదన కలిగించాయి. నేతలు, కార్యకర్తల కృషి వల్లే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేస్తా. ఎంపీలంతా రాష్ట్ర ప్రయోజనాల కోసం దిల్లీలో పనిచేయాలి’’ అని  చంద్రబాబు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని