Chandrababu: వ్యవస్థలను రాజకీయ కక్షల కోసం వాడుకుంటున్నారు: చంద్రబాబు

తెదేపా శ్రేణులపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 01 Mar 2024 16:53 IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల అణచివేతే లక్ష్యంగా అధికార పార్టీ అక్రమ కేసులు పెడుతోందని గవర్నర్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రభుత్వం వ్యవస్థలను రాజకీయ కక్షల కోసం వాడుకుంటూ తెదేపా నేతలను వేధిస్తోందని లేఖలో పేర్కొన్నారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడి అక్రమ అరెస్టును ప్రస్తావిస్తూ ఏపీఎస్‌డీఆర్‌ఐ దుర్వినియోగంపై మండిపడ్డారు. ప్రభుత్వ విభాగాల ద్వారా తెదేపా నేతలు, కార్యకర్తలపై జగన్‌ అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీఎస్‌డీఆర్‌ఐ ద్వారా తెలుగుదేశం నేతలను బెదిరించి ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ప్రతిపక్షాలను వేధించేందుకు ఆయుధంగా ప్రభుత్వం వాడుకుంటోందని లేఖలో పేర్కొన్నారు. అధికార పార్టీకి విధేయుడైన చిలకల రాజేశ్వరరెడ్డిని ఆ సంస్థకు ప్రత్యేక కమిషనర్‌గా నియమించుకొని తెదేపా నేతలను టార్గెట్‌ చేస్తున్నారని మండిపడ్డారు.

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును కూడా ఈ విభాగం ద్వారా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారన్న చంద్రబాబు.. మళ్లీ ఇప్పుడు ప్రత్తిపాటి కుమారుడు శరత్‌ను కేసులో ఇరికించి అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. శరత్‌ ఆ సంస్థలో కేవలం 68 రోజులు మాత్రమే అడిషినల్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారని గుర్తు చేశారు. కేవలం తెదేపా నేతలను వేధించడమే ఏపీఎస్‌డీఆర్ఐ పనా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం సీఐడీని జేబు సంస్థగా మార్చుకుని ఇప్పటికే ప్రత్యర్థి పార్టీ నేతలను కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. ఏపీఎస్‌డీఆర్‌ఐ వేధింపులు భరించలేక పలువురు వ్యాపార వేత్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని గుర్తు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు