Chandrababu: నేడే చంద్రబాబు ప్రమాణ స్వీకారం

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు మంగళవారం సాయంత్రానికి పూర్తయ్యాయి. కృష్ణా జిల్లా కేసరపల్లిలో సభాప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

Updated : 12 Jun 2024 07:36 IST

ముస్తాబైన వేదిక
ప్రముఖుల రాక నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత
60 మందికిపైగా ఐపీఎస్‌ల పర్యవేక్షణ
దారులన్నీ కేసరపల్లికే..!

ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదిక

ఈనాడు, ఈనాడు డిజిటల్‌ - అమరావతి, న్యూస్‌టుడే, గన్నవరం గ్రామీణం: చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు మంగళవారం సాయంత్రానికి పూర్తయ్యాయి. కృష్ణా జిల్లా కేసరపల్లిలో సభాప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి బుధవారం ఉదయం 11.27 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, అగ్రనటులు చిరంజీవి, రజనీకాంత్‌ తదితరులు వస్తుండడంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. గన్నవరం మండలం కేసరపల్లిలో సభ కోసం 11.18 ఎకరాలను సిద్ధం చేశారు. 36 గ్యాలరీల్లో అందరికీ వేదిక కనిపించేలా ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటుచేశారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా నాలుగు గ్యాలరీలు సిద్ధం చేశారు. 

ఐదు చోట్ల పార్కింగ్‌ ప్రదేశాలు

వాహనాల పార్కింగ్‌ కోసం వివిధ చోట్ల 56 ఎకరాలను కేటాయించారు. విజయవాడ వైపు నుంచి వచ్చే వాటి కోసం ముస్తాబాద రోడ్డులో ఎస్‌ఎల్‌వీ సమీపంలోని పార్కింగ్‌ ఇచ్చారు. ఈ ప్రాంతం సభా వేదికకు 1.5 కి.మీ దూరం. అక్కడి నుంచి కాలినడకన సభా ప్రాంగణానికి చేరుకోవాలి. వేదిక నుంచి 700 మీటర్ల దూరంలోని ఎలైట్‌ విస్టా వద్ద రెండో పార్కింగ్‌ ప్రదేశాన్ని ఏర్పాటుచేశారు. ఏలూరు వైపు నుంచి వచ్చే వారికి ఏర్పాటుచేసిన పార్కింగ్‌.. వేదికకు 730 మీటర్ల దూరంలో ఉంది. మేధా టవర్స్‌ వద్ద వేదికకు 300 మీటర్ల దూరంలో ప్రముఖుల కోసం మరో పార్కింగ్‌ప్రదేశాన్ని ఉద్దేశించారు. 

గన్నవరం విమానాశ్రయం వద్ద ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు

భద్రతా దళాల గుప్పిట ప్రాంగణం

కార్యక్రమానికి అత్యంత ప్రముఖులు తరలివస్తుండడంతో పోలీసులు భారీగా భద్రతా చర్యలు చేపట్టారు. దాదాపు 10వేల మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. విజయవాడకు 3వేల మంది పోలీసులను కేటాయించారు. గన్నవరం విమానాశ్రయం, పరిసర ప్రాంతాలు, కేసరపల్లి సభా ప్రాంగణం లోపల, వెలుపల 7వేల మందికి రక్షణ విధులు అప్పగించారు. 60మంది పైగా ఐపీఎస్‌ అధికారులను నియమించారు. డీజీ హోదా మొదలు ఎస్పీ ర్యాంకు వరకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. వీరికి తోడుగా ట్రైనీ ఐపీఎస్‌లూ వచ్చారు. వీవీఐపీల వాహనశ్రేణి నేరుగా వేదిక వచ్చేందుకు వీలుగా ప్రత్యేక బీటీ రోడ్లను నిర్మించారు. ప్రాంగణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 

పాస్‌లు ఉంటేనే జాతీయ రహదారిపైకి అనుమతి

ప్రాంగణం పక్కనే ఉన్న జాతీయరహదారిపై ట్రాఫిక్‌జామ్‌ కాకుండా పోలీసులు చర్యలు ప్రారంభించారు. కార్యక్రమానికి పాస్‌లు ఉన్నవారినే చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపైకి అనుమతించనున్నారు. పాస్‌లు లేనివారిని రోడ్లపైకి అనుమతించబోమని విజయవాడ పోలీసు కమిషనర్‌ పీహెచ్‌డీ రామకృష్ణ చెబుతున్నారు. సభకు వచ్చేవారు లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతి లేదని, వాహనాల్లో ఉంచి ప్రాంగణంలోకి రావాలని పోలీసులు కోరుతున్నారు. 

బెంగళూరు పూలతో వేదిక

వేదికను అందంగా అలంకరించే బాధ్యతను ఉద్యానశాఖకు అప్పగించారు. భారీగా ఏర్పాటుచేసిన వేదిక అందంగా కనిపించేందుకు ప్రత్యేకంగా వివిధ రకాల పూలను బెంగళూరు నుంచి తెప్పించారు. వేదికతో పాటు వీవీఐపీల విశ్రాంతి గదులనూ పూలతో అలంకరించారు. 

సైకిల్‌పై కదిరి నుంచి..

చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం హిందూపురం జిల్లా కదిరి నుంచి 480 కి.మీ. మేర సైకిల్‌పై తెదేపా కార్యకర్త సతీష్‌ కేసరపల్లి వచ్చాడు. ఈ నెల 8న కదిరిలో బయలుదేరిన సతీష్, మంగళవారం మధ్యాహ్నం సభాప్రాంగణానికి చేరుకున్నారు. ‘వైకాపా పాలనలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలే. ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే దాడులు చేశారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టుచేసి జైలుకు తరలించినప్పుడు కదిరి నుంచి సైకిల్‌పై వెళ్లాను. ఐదేళ్ల అరాచక వైకాపాను గద్దె దింపిన తెదేపా అధినేత.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారని సైకిల్‌పై వచ్చాను’ అని సతీష్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని