Chandrababu: తెదేపా-జనసేన విన్నింగ్‌ టీమ్‌.. వైకాపా చీటింగ్‌ టీమ్‌: చంద్రబాబు

వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసమే తెదేపా-జనసేన పార్టీలు కలిశాయని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు.

Updated : 28 Feb 2024 21:17 IST

తాడేపల్లిగూడెం: కూటమిలో ఎవరు ఎక్కువ.. తక్కువ కాదని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల కోసం కలిసి అడుగులు వేస్తున్నామన్నారు. తాడేపల్లిగూడెంలో తెదేపా-జనసేన ఉమ్మడి సభలో ఆయన మాట్లాడారు. ‘‘తెదేపా-జనసేన దెబ్బకు ఫ్యాన్‌ ముక్కలై పోవాలి. పొత్తు గెలవాలి.. రాష్ట్రం నిలవాలి. ఆంధ్రప్రదేశ్‌ ఇక అన్‌స్టాపబుల్‌. రాష్ట్రంలో విధ్వంసానికి ఫుల్‌స్టాప్‌ పడుతుంది. తెదేపా - జనసేన విన్నింగ్‌ టీమ్‌.. వైకాపాది చీటింగ్‌ టీమ్‌. తెదేపా అగ్నికి పవన్‌ వాయువులా తోడయ్యారు. ఈ సభ చూశాక మా గెలుపు ఎవరూ ఆపలేరని అర్థమైంది’’ అని ధీమా వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకం

‘‘వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకం. వైకాపా దొంగలపై తెదేపా-జనసేన పోరాడాలి. రాష్ట్ర ప్రజల కోసం కుదిర్చిన పొత్తు ఇది. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలు మాతో చేతులు కలపాలి. 2029కి విజన్‌ డాక్యుమెంట్‌ తయారు చేశాం. హైదరాబాద్‌ కంటే మిన్నగా రాజధాని ఉండాలని అమరావతికి రూపకల్పన చేశాం. పోలవరం ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే సంకల్పంతో ముందుకెళ్లాం. కానీ, రాష్ట్రంలో ఇప్పుడు సైకో పాలన ఉంది. ఏ సీఎం అయినా అభివృద్ధి పనులతో పాలన సాగిస్తారు.. జగన్‌ సీఎం అయ్యాక అరాచకాలతో పాలన సాగిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని జగన్‌ అపహాస్యం చేశారు. వైకాపా వేధింపులు తట్టుకోలేక క్రికెటర్‌ హనుమ విహారి పారిపోయే పరిస్థితి వచ్చింది. సొంత చెల్లి మరో పార్టీలో చేరితే సోషల్‌మీడియాలో వేధించారు. జగన్‌ మానసిక స్థితికి ఈ ఘటనలే నిదర్శనం. అందుకే, వైకాపాను చిత్తుగా ఓడించి సైకో నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలి.

అట్టర్‌ఫ్లాప్‌ సినిమాకి సీక్వెల్‌ ఉంటుందా?

జగన్‌.. 25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు? తెచ్చారా? కుప్పం ప్రాంతానికి నీళ్ల పేరిట జగన్‌ నాటకాలు వేశారు. ఒక్క రోజులోనే అంతా సర్దుకొని పోయారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజార్టీ వస్తుంది. జగన్‌ పాలన ఒక అట్టర్‌ఫ్లాప్‌ సినిమా. అలాంటి సినిమాకి సీక్వెల్‌ ఉంటుందా? తెదేపా-జనసేన కూటమి సూపర్‌హిట్‌. వైకాపా గూండాలకు మా సినిమా చూపిస్తాం. తెదేపా-జనసేన విన్నింగ్‌ టీమ్‌.. వైకాపా చీటింగ్‌ టీమ్‌. వైనాట్‌ 175 కాదు.. వైనాట్‌ పులివెందుల? రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో మా వద్ద బ్లూప్రింట్‌ ఉంది. పెట్టుబడులు తెచ్చి రాష్ట్రంలో సంపద సృష్టించి పేదలకు పంచుతాం. ఇక ఏపీ అన్‌స్టాపబుల్‌. కూటమి వల్ల కొందరు నేతలు ఇబ్బంది పడి ఉండొచ్చు.. కానీ, పార్టీ కోసం పనిచేసిన అందరికీ న్యాయం చేస్తాం’’అని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు