Chandrababu: జగన్‌.. గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు: చంద్రబాబు

గొడ్డలి పోటు, కోడికత్తి డ్రామాలు ఆడిన జగన్‌ .. ఇప్పుడు గులకరాయి నాటకం ఆడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Updated : 17 Apr 2024 20:23 IST

పెడన: గొడ్డలి పోటు, కోడికత్తి డ్రామాలు ఆడిన జగన్‌.. ఇప్పుడు గులకరాయి నాటకం ఆడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్నికలు వచ్చాయని మళ్లీ ఇప్పడు కొత్త నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. ఇలాంటి డ్రామాలను ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. నాపై, పవన్‌పై దాడి జరిగితే రాయి కనిపించింది. కానీ, జగన్‌పై పడిన రాయి ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు. జగన్‌పై రాయిదాడిని మేం ఖండించాం.. కానీ, తమపై రాయిదాడి జరిగితే జగన్‌ ఖండించలేదన్నారు. చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్‌ ప్రజాగళం సభకు మూడు పార్టీల శ్రేణులు భారీగా తరలి రావడంతో కృష్ణాజిల్లా పెడన జన ప్రభంజనమైంది. పెడన బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభావేదిక వరకు రోడ్ షో ద్వారా ఒకే వాహనంలో ఇద్దరు నేతలు చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘లిక్కర్‌, ఇసుక, భూకబ్జాల ద్వారా సంపాదించిన డబ్బుతో ఓట్లు కొనాలని జగన్‌ చూస్తున్నారు. జగన్‌ వేధింపులు తట్టుకోలేక అనేక మంది వైకాపా నాయకులు బయటకు వచ్చారు. ఐదేళ్లలో ఎంపీగా ఉన్నా.. ఏమీ చేయలేకపోయాననే బాధతో బాలశౌరి బయటికొచ్చి జనసేనలో చేరారు. ప్రజలను గెలిపించేందుకే తెదేపా, భాజపా, జనసేన కలిశాయి. అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణే మా కూటమి అజెండా. మా వద్ద డబ్బులేదు .. కానీ, నిజాయితీ ఉంది. పొత్తు బాధ్యత కింద కొనకళ్ల నారాయణ, బూరగడ్డ వేదవ్యాస్‌ సీట్లు త్యాగం చేశారు. వారికి అండగా ఉంటాం. ప్రజాజీవితంలోనూ హీరోగా నిరూపించుకున్న వ్యక్తి.. పవన్‌ కల్యాణ్.

జగనాసురవధ చేయాలి..

శ్రీరాముడు రావణాసుర వధ చేశారు.. ఏపీ ప్రజలు జగనాసుర వధ చేయాలి. అన్ని వర్గాలను నట్టేట ముంచేసిన సైకో జగన్‌ కొత్త పేరు జె గన్‌ సైకో. బటన్‌ నొక్కడం తప్ప అతనికేం తెలియదు.. బటన్‌ నొక్కడానికి జగన్‌ కావాలా? ఇంట్లో ఉండే ముసలమ్మ కూడా నొక్కుతుంది. మావి మూడు జెండాలు.. కానీ, అజెండా ఒక్కటే. మేం ముగ్గురం కలిసి వస్తుంటే.. జగన్‌ శవాలతో వస్తున్నాడు. విధ్వంసం, అహంకారంతో రాష్ట్రాన్ని నాశనం చేశాడు.

నవరత్నాలు కాదు.. నకిలీరత్నాలు

వైకాపావి నవరత్నాలు కాదు.. నకిలీ రత్నాలు. ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది.  పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తే కృష్ణా డెల్టాకు మూడు పంటలకు నీళ్లు వచ్చేవి. పోలవరం పూర్తి చేయలేదు, పట్టిసీమను పట్టించు కోలేదు. బందరు పోర్టు, రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయి పెడనకు పరిశ్రమలు వస్తే .. మీ పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి. ఇదే మా కల.. ఆలోచన. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుంది.. అభివృద్ధి సాధ్యమవుతుంది. మా హయాంలోనే మచిలీపట్నం- విజయవాడ హైవే నిర్మించాం’’ అని చంద్రబాబు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని