Chandrababu: ముసుగు వీరుడు వస్తున్నాడు.. ఇంటికి పంపేందుకు మేమూ సిద్ధమే: చంద్రబాబు

వైకాపా పాలనలో రాయలసీమను రాళ్లసీమగా మార్చారని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) విమర్శించారు. ఎన్నికల్లో (Andhra Pradesh Assembly elections) ఓటు అడిగే అర్హత ఆ పార్టీ నేతలకు లేదన్నారు.

Updated : 27 Mar 2024 14:48 IST

పలమనేరు: వైకాపా పాలనలో రాయలసీమను రాళ్లసీమగా మార్చారని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) విమర్శించారు. ఎన్నికల్లో (Andhra Pradesh Assembly elections) ఓటు అడిగే అర్హత ఆ పార్టీ నేతలకు లేదన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో ఆయన మాట్లాడారు. సీమలో జగన్‌ ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేదన్నారు. తెదేపా హయాంలో పలు ప్రాజెక్టులు 90 శాతం పూర్తయితే.. మిగిలిన 10 శాతం కూడా కంప్లీట్‌ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు కృష్ణా జలాలు అందించిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని చెప్పారు. తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉండగా తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రారంభించామని వివరించారు. జగన్‌ను ఇంటికి పంపేందుకు తామూ సిద్ధమని వ్యాఖ్యానించారు.

సాక్షికి రూ.వేల కోట్ల ప్రకటనలు..

‘‘తెదేపా హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చాం. దీంతో కరవు సీమలో నీటిపారుదల రంగంలో మార్పులు వచ్చాయి. రాష్ట్ర విభజనతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పెద్ద ఎత్తున ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాం. ఐదేళ్లలో రూ.68వేల కోట్లు ఖర్చు చేశాం. ఒక్క రాయలసీమలోనే రూ. 12వేల కోట్లు ఖర్చు పెట్టాం. హంద్రీనీవాపై రూ.4,200 కోట్లు ఖర్చు చేయడంతో పనులు పరుగులు పెట్టాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 25 ప్రాజెక్టులను రద్దు చేసిన నీచ చరిత్ర వైకాపా ప్రభుత్వానిది. రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టులకు కేవలం రూ.2,165 కోట్లే కేటాయించారు. అవినీతిలో పుట్టిన సాక్షి పత్రికకు మాత్రం ప్రకటనల రూపంలో రూ.వేల కోట్లు ఇస్తున్నారు. ఎక్కడ భూములు కనిపించినా వైకాపా నేతలు వదల్లేదు. ఆలయ భూములూ విడిచిపెట్టడం లేదు. చివరికి ఇళ్లను కూడా కబ్జా చేసే పరిస్థితి వస్తుంది.

ఎన్డీయేలో ఉన్నప్పుడు మైనారిటీలకు అన్యాయం జరగలేదు..

ముసుగు వీరుడు పరదాలు దాటి బయటకు వస్తున్నాడు. అతడికి ఖాళీ రోడ్లు స్వాగతం పలకాలి. సీమకు అన్యాయం చేసిన ద్రోహి జగన్‌. రావడానికి వీళ్లేదని ప్రజలు గట్టిగా చెప్పాలి. జనం గెలవాలంటే.. జగన్‌ దిగిపోవాలి. రాష్ట్రం కోసం భాజపాతో కలిస్తే మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఐదేళ్ల పాటు కేంద్రంలోని భాజపా సర్కారు బిల్లులకు జగన్‌ మద్దతిచ్చారు. మైనారిటీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారా?మేం గతంలో ఎన్డీయేలో ఉన్నప్పుడు మైనారిటీలకు అన్యాయం జరగలేదు. వారి కోసం ఎన్నో పథకాలు అమలు చేసిన పార్టీ తెదేపా. రాయలసీమలో జగన్‌ను నిలదీయాలి.’’అని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని