TDP: తొలి జాబితాలో చోటు దక్కని నేతలకు చంద్రబాబు భరోసా

తెలుగుదేశం తొలి జాబితాలో చోటు దక్కని నేతలతో అధినేత చంద్రబాబు విడివిడిగా మాట్లాడారు.

Updated : 25 Feb 2024 20:23 IST

అమరావతి: తెలుగుదేశం (TDP) ప్రకటించిన తొలి జాబితాలో చోటు దక్కని ఆలపాటి, బొడ్డు వెంకటరమణ, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమా, పీలా గోవింద్‌తో పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) విడివిడిగా మాట్లాడారు. పొత్తులో భాగంగా తెనాలి సీటు సర్దుబాటును అర్థం చేసుకోవాలని మాజీమంత్రి ఆలపాటి రాజాకు సూచించారు. రాజకీయ భవిష్యత్‌కు తగిన ప్రత్యామ్నాయం కల్పిస్తానని హామీ ఇచ్చారు. పొత్తులు, పార్టీ నిర్ణయాల్ని గౌరవిస్తానని రాజా చెప్పినట్టు సమాచారం. భేటీ అనంతరం నారా లోకేశ్‌ను కలిసిన ఆలపాటి రాజా.. అధినేతతో సమావేశంపై హర్షం వ్యక్తం చేశారు.

అనకాపల్లి ఎంపీ టికెట్‌ ఆశించిన పీలా గోవింద్‌.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడితో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. జనసేనతో పొత్తు ఉన్నందున పరిస్థితి అర్థం చేసుకోవాలని, సముచిత న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. రాజానగరం తెలుగుదేశం ఇన్‌ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి ఆదివారం ఉండవల్లిలో చంద్రబాబును కలిశారు. రాజమహేంద్రవరం ఎంపీ సీటు, లేదా మరో ప్రత్యామ్నాయం పరిశీలిస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. భేటీపై వెంకటరమణ సంతృప్తి వ్యక్తం చేశారు.

అధినేత మాటే శిరోధార్యం: ఉమా

తెలుగుదేశం అధినేత మాటే తనకు శిరోధార్యమని మాజీ మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు. తాను చంద్రబాబు కుటుంబ సభ్యుడిని అంటూ విధేయత చాటుకున్నారు. ఆదివారం ఉండవల్లిలోని నివాసంలో పార్టీ అధినేతతో ఉమా సమావేశమయ్యారు. కొన్ని సమీకరణాల్లో భాగంగానే తొలి జాబితాలో పేరు ప్రకటించలేదని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం.

చీపురుపల్లి నుంచి పోటీ చేయమన్నారు: గంటా

తొలి జాబితాలో చోటు దక్కని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta srinivasarao) కూడా చంద్రబాబును కలిశారు. భేటీ ముగిసిన తర్వాత గంటా  మీడియాతో మాట్లాడారు. ‘‘ చీపురుపల్లి నుంచి పోటీ చేయమని సూచించారు. భీమిలి నుంచి పోటీ చేస్తానని చెప్పా. నువ్వెక్కడ పోటీ చేసినా గెలుస్తావని అన్నారు. ఎక్కడ పోటీ చేయాలనే విషయం తనకు వదిలిపెట్టాలని చంద్రబాబు అన్నారు. తెదేపా తొలి జాబితా ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మొదటి జాబితాపై ప్రజాస్పందన బాగుందని చెప్పా. సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో.. వైకాపా ఓడిపోవడం అంతే నిజం’’ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని