Chandrababu: గెలుపే లక్ష్యం.. అభ్యర్థుల పనితీరుపై ప్రతివారం సర్వే: చంద్రబాబు

తొలి జాబితాలో సీట్లు పొందిన అభ్యర్థుల పనితీరు సరిగాలేకుంటే మార్చేందుకు ఎంత మాత్రం వెనుకాడనని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు.

Updated : 25 Feb 2024 15:17 IST

అమరావతి: తొలి జాబితాలో సీట్లు పొందిన అభ్యర్థుల పనితీరు సరిగా లేకుంటే మార్చేందుకు ఎంత మాత్రం వెనుకాడనని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. 94 మంది అభ్యర్థులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు.. ప్రతి వారం పనితీరు పర్యవేక్షిస్తానని  స్పష్టం చేశారు. ఎన్నికల వరకు ప్రతివారం రోజులకు ఒక సర్వే చేయిస్తా.. తేడా వస్తే వేటు తప్పదని తేల్చిచెప్పారు. టికెట్లు వచ్చేశాయనే నిర్లక్ష్యం తగదని స్పష్టం చేశారు. వచ్చే 40 రోజులు అత్యంత కీలకమన్న చంద్రబాబు.. ప్రభుత్వ విధానాలతో పాటు స్థానిక ఎమ్మెల్యేల పనితీరును ఎండగట్టేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని సూచించారు. జనసేన కేడర్‌తోనూ సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు వెళ్లాలని పిలుపునిచ్చారు. 5కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ కోసం తెదేపా-జనసేన పొత్తులో పోటీ చేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా, గెలుపే లక్ష్యంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు. గతంలో ఎప్పుడూ ఇంత ముందుగా అభ్యర్థుల ప్రకటన జరగలేదని గుర్తు చేశారు.

సమన్వయంతో పనిచేయాలి..

పార్టీ అభ్యర్థులకు సైతం ప్రజల మద్దతు, ఆమోదం ఉండాలని కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశానని స్పష్టం చేశారు. ఎవరైనా అసంతృప్తితో ఉంటే ఒకటికి పది సార్లు స్వయంగా వెళ్లి కలవాలని స్పష్టం చేశారు. తానే అభ్యర్థిని కదా అని ఇగోతో వ్యవహరిస్తే కుదరదన్నారు. తటస్థులను కలిసి  రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించి అన్ని వర్గాల మద్దతు కోరాలని సూచించారు. జనసేన  మిత్ర పక్షం కాబట్టి, ఆ పార్టీ నేతలను కలుపుకొని పోవాలని తేల్చి చెప్పారు. జనసేన శ్రేణులు మీతో కలిసి ప్రయాణం చేసేలా సమన్వయంతో వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. 1.3 కోట్ల మంది నుంచి అభిప్రాయాలు తీసుకుని, సర్వేలు పరిశీలించి, సుదీర్ఘ కసరత్తు చేసి అభ్యర్థుల ఎంపిక చేశానని వివరించారు.

అన్నింటికీ సిద్ధంగా ఉండాలి...

దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీలో కూడా ఎప్పుడూ ఇటువంటి ప్రయత్నం జరగలేదని, ఒక్క సీటు కూడా ఓడిపోవడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు రాష్ట్రానికి, రాష్ట్ర భవిష్యత్‌కు ఎంతో కీలకమన్నారు. ఏ స్థాయిలో కూడా చిన్న తప్పు, పొరపాటు జరగకూడదన్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించామని, ఇప్పుడు 99 చోట్ల ఉమ్మడి అభ్యర్థులనూ ప్రకటించామన్నారు.  జగన్ అహంకారంతో చేసిన విధ్వంసం అతని పతనానికి నాంది కాబోతోందని దుయ్యబట్టారు. చరిత్రలో చూడని విధ్వంస పాలకుడైన జగన్‌ను ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. ప్రజలతో ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత అభ్యర్థులపై ఉందని స్పష్టం చేశారు. జగన్ ఎన్నికలకు సిద్ధంగా లేడన్న చంద్రబాబు, సిద్ధం అని సభలు పెడుతూ అభ్యర్థులను మాత్రం ప్రకటించలేకపోయాడని ఎద్దేవా చేశారు. జగన్ ఎన్నికల్లో గెలుపునకు తన పాలనను నమ్ముకోలేదని, దౌర్జన్యాలు, అక్రమాలు, దొంగ ఓట్లు, డబ్బును నమ్ముకున్నాడని ధ్వజమెత్తారు. ఊహించని స్థాయిలో జగన్ కుట్రలు కుతంత్రాలు చేస్తాడని, అన్నింటికీ సిద్ధంగా  ఉండాలన్నారు. ఎన్నికల వరకు రోజూవారీ చేపట్టాల్సిన ప్రణాళికపై చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని