Chandrababu: వైకాపా హింసకు పాల్పడొచ్చు.. కూటమి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు

కౌంటింగ్‌ కేంద్రాల్లో కూటమి కౌంటింగ్‌ ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు.

Updated : 03 Jun 2024 20:56 IST

మంగళగిరి: కౌంటింగ్‌ కేంద్రాల్లో తెదేపా, జనసేన, భాజపా కౌంటింగ్‌ ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) సూచించారు. జూన్‌ 4న ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ జరగనున్న నేపథ్యంలో కూటమి కౌంటింగ్‌ ఏజెంట్లతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పోస్టల్‌ బ్యాలెట్ల విషయంలో వైకాపాకు సుప్రీంకోర్టులోనూ మొట్టికాయలు పడ్డాయని, ఓటమి తట్టుకోలేక ఆ పార్టీ నేతలు హింసకు పాల్పడే ప్రమాదం ఉందని చెప్పారు. కూటమి ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏజెంట్లు ఎలా వ్యవహరించాలో ఇప్పటికే శిక్షణ ఇచ్చామని, ప్రతి ఓటూ కీలకమేనన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.

‘‘ఏజెంట్లు నిర్దేశిత సమయానికి కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలి. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అన్ని రౌండ్లు పూర్తయ్యే వరకు ఎవరూ బయటకు రావొద్దు. కంట్రోల్ యూనిట్ నంబర్ ప్రకారం సీల్‌ను సరిచూసుకోవాలి. ప్రతి ఒక్కరూ 17-సీ ఫాం దగ్గర పెట్టుకొని పోలైన ఓట్లను, కౌంటింగ్‌లో వచ్చిన ఓట్లను సరిచూసుకోవాలి. అన్ని రౌండ్లు పూర్తయ్యాక ఓట్లలో తేడాలు ఉంటే వీవీప్యాట్‌లు లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్‌కు వెళ్లిన ఏజెంట్లు.. ఏ మాత్రం అనుమానం ఉన్నా ఆర్వోకు ఫిర్యాదు చేయొచ్చు. ఈ ఫిర్యాదుకు సంబంధించి ఎకనాలెడ్జ్‌మెంట్ తప్పకుండా తీసుకోవాలి. మనకున్న అభ్యంతరాలపై నిబంధనలు పాటిస్తూనే అధికారులకు ఫిర్యాదు చేయాలి. అనారోగ్య కారణాలతో ఏజెంట్‌ ఎవరైనా రాలేకపోతే నిబంధనల ప్రకారం కౌంటింగ్‌కు ముందే మరొకరిని నియమించుకునే వెసులుబాటు ఉంది. నిబంధనలు అమలయ్యేలా చూడటంలో ఎవరూ రాజీ పడొద్దు’’అని ఏజెంట్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని