Chandrababu: ఈ స్థాయిలో అక్రమాలు చేయడం గతంలో ఎప్పుడూ చూడలేదు: చంద్రబాబు

చంద్రగిరి తెదేపా ఇన్‌ఛార్జి పులివర్తి నానిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల దొంగ ఓట్లు తొలగించాలని నిరసన వ్యక్తం చేస్తూ పులివర్తి అస్వస్థతకు గురయ్యారు.

Published : 16 Jan 2024 02:57 IST

తిరుపతి: చంద్రగిరి తెదేపా ఇన్‌ఛార్జి పులివర్తి నానిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) సోమవారం పరామర్శించారు. ఇటీవల దొంగ ఓట్లు తొలగించాలని తిరుపతి గ్రామీణం ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ పులివర్తి అస్వస్థతకు గురయ్యారు. ఆయన ప్రస్తుతం ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను చంద్రబాబు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రగిరిలో వేల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్చారు. తిరుపతి, పీలేరు, శ్రీకాళహస్తి, సత్యవేడులోనూ దొంగ ఓట్లు చేర్చారు. ఇలా విచ్చలవిడిగా చేర్చుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఎన్నికల అక్రమాలపై తిరుపతి జిల్లా కలెక్టర్‌పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని చోట్ల పోలింగ్‌ బూత్‌లు మార్చేశారు. ఒకే వ్యక్తికి మూడు వేర్వేరు చోట్ల ఓటు ఉంది. అక్రమాలు చేసిన అధికారులను జైలుకు పంపించే అవకాశం ఉంటుంది. సచివాలయ సిబ్బంది సాయంతోనే దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారు. బోగస్‌ గుర్తింపు కార్డులు కూడా ఇస్తున్నారు. ఈ స్థాయిలో అక్రమాలు చేయడం గతంలో ఎప్పుడూ చూడలేదు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తెదేపా పోరాటం చేస్తోంది. గత 40 ఏళ్లుగా నేను ఈ జిల్లాను చూస్తూ వస్తున్నాను. ఏన్నడూ లేనంతగా మనీ పవర్‌, భూకబ్జాలు, దోచుకోవడం లాంటివి ఇప్పుడు చూస్తున్నా. అలా దోచుకున్న డబ్బును తీసుకొచ్చి యథేచ్ఛగా పంపిణీ చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇకపై ఇలాంటివి జరగనివ్వం. రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారు. వైకాపాను ఇంటికి పంపడం ఖాయం. మేం ఎట్టి పరిస్థితుల్లో ఎవరినీ వదిలిపెట్టం. అధికారులకూ ఇదే మా హెచ్చరిక. చట్ట ప్రకారం విధులు నిర్వర్తించండి. చట్టాన్ని ఉల్లంఘించి ఇష్టానుసారం చేస్తానంటే మాత్రం ఊరుకోం. అక్రమాలకు పాల్పడుతోన్న అధికారుల ప్రవర్తనపై కేంద్ర ఎన్నికల సంఘం, డీవోపీటీకి పూర్తి వివరాలు అందిస్తాం. వారు చేసిన అక్రమాలకు సంబంధించిన అన్ని విషయాలు ఆధారాలతో సహా కోర్టుకు సమర్పిస్తాం. ఎవరినీ వదిలిపెట్టం.. తప్పు చేసిన వారిని జైలుకు పంపించేవరకు ఊరుకోం. అంగన్వాడీలు, ఉద్యోగులను ఈ ప్రభుత్వం మోసం చేసింది. తెదేపా అధికారంలోకి రాగానే అందరి సమస్యలు పరిష్కరిస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని