pulivarthi nani: భాస్కర్‌రెడ్డీ.. నీ అవినీతిని ఆధారాలతో బయటపెడతా: పులివర్తి నాని

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ చేయడం వల్ల  వైకాపా ఆటలు సాగలేదని ఆ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నాని అన్నారు.

Updated : 27 May 2024 19:47 IST

చంద్రగిరి: తాజా అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ చేయడం వల్ల  వైకాపా ఆటలు సాగలేదని ఆ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. ఆ అక్కసుతోనే తనపై దాడులు చేశారని ఆరోపించారు. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్‌ రూమ్‌ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తుండగా ఇటీవల నానిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ఆయన ఇవాళ తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలింగ్‌ రోజు, ఆ తర్వాతి రోజుల్లో నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇసుక మాఫియా కారణంగా ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని, దీనికి నిరసనగా అప్పట్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే చెవిరెడ్డి.. పోలీసుల్ని పంపించి దీక్షను భగ్నం చేశారని అన్నారు. 2014 ఎన్నికల నుంచీ ఆయన దొంగ ఓట్లతోనే నెట్టుకొస్తున్నారని విమర్శించారు.

‘‘ఈ ఎన్నికల్లోనూ రిగ్గింగ్‌ చేసి చంద్రగిరి వైకాపా అభ్యర్థి, కుమారుడు రోహిత్‌రెడ్డిని గెలిపించుకునేందుకు భాస్కర్‌రెడ్డి ప్రయత్నించారు. కానీ, వారి ఆటలు సాగలేదు. నేను 2004 నుంచి 2014 వరకు సంపాదించిన ఆస్తుల్ని అమ్ముకొని రాజకీయం చేశాను. తెదేపా కార్యకర్తలు, పార్టీ పెద్దల అండదండలతో నాయకుడిగా ఎదిగాను. అంతే తప్ప మీలా అడ్డదారులు తొక్కలేదు. ‘జగన్‌ భజన’ చేయలేదు. ఎర్రచందనం మాఫియా నడపలేదు. ఎర్రచందనం స్మగ్లర్లు కొనిచ్చిన కార్లలో తిరగలేదు. నీ అవినీతి భాగోతాన్ని ఆధారాలతో సహా బయటపెడతా. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి.  కార్యకర్త స్థాయి నుంచి ప్రజా సమస్యలపై పోరాడి నాయకుడిగా ఎదిగా. ఆ సంగతి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. మీ సొంత ప్రయోజనాల కోసం తప్ప.. ప్రజల కోసం ఎప్పుడైనా పోరాడారా?

నాపై దాడి చేసిన తర్వాతే నా కుటుంబ సభ్యులు స్పందించారు. నన్ను హతమారుస్తానని హెచ్చరించిన తర్వాతే నా భార్య బయటకొచ్చి మాట్లాడారు. అది కూడా ప్రజా సమస్యలపైన, మీ అవినీతిపైన మాట్లాడారే తప్ప.. వ్యక్తిగత విమర్శలు చేయలేదు. నా క్వారీలు, ఫ్యాక్టరీలు అక్రమంగా మూయించినా మిమ్మల్ని పన్నెత్తి మాటైనా అనలేదు. నాపై దాడి జరిగిన తర్వాత కార్యకర్తలు అదుపు తప్పుతారనే ఉద్దేశంతో అక్కడే ఉండి పరిస్థితి చక్కబడిన తర్వాత ఆస్పత్రికి వెళ్లాను. కాళ్లు విరగలేదని, డ్రామాలు చేస్తున్నాని అంటున్నావు. ఇది చాలా దారుణం. నీ కోసం పని చేసిన నాయకులకు, ఎంపీటీసీ, జడ్పీటీసీ టికెట్లు ఇచ్చేందుకు వేలం పాట పెట్టి.. డబ్బులు వసూలు చేసుకున్నావు. ఎప్పుడు ప్రెస్‌మీట్‌ పెట్టినా, నువ్వు, నీ కొడుకు తప్ప మీ పక్కన ఎవరికైనా స్థానం ఇచ్చారా? మీరా నీతులు చెప్పేది.

నేను 2 సార్లు ఆత్మహత్యాయత్నం చేసుకున్నది వాస్తవమే. అది కేవలం ప్రజల కోసమే. ఓడిపోయినా ప్రజల మధ్యనే ఉన్నా.  మీలా నియోజకవర్గాన్ని దోచుకోలేదు. పక్క రాష్ట్రాలకు పారిపోలేదు. 2019 ఎన్నికల నాటికి నాపై ఒక్క కేసు కూడా లేదు. ఇప్పుడు మాత్రం అక్రమంగా 28 కేసులు బనాయించారు. ఐదేళ్లు మీరు చేసిన అవినీతే ఇవాళ మిమ్మల్ని ఓడించబోతోంది. వైకాపా నాయకులు, కార్యకర్తల కుటుంబ సభ్యుల ఆవేదనే ఇవాళ నన్ను గెలిపిస్తోంది. ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తున్నా. ప్రజల మధ్యనే ఉంటా. వారికోసమే పని చేస్తా, నా తుదిశ్వాస వరకు చంద్రగిరి నియోజకవర్గ ప్రజల కోసం పని చేస్తా.  

నాపై దాడి చేసిన వారిని పోలీసులే పట్టుకుంటారు. చట్టం తనపని తాను చేసుకుపోతుంది. ఫలానా వాళ్లు దాడి చేశారని, వాళ్లను అరెస్టు చేయమని చెప్పను. ఇప్పటి వరకు అరెస్టయినవారిలో నలుగురికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. భాస్కర్‌రెడ్డి, మోహిత్‌రెడ్డి, రఘు, భానుకుమార్‌రెడ్డి నన్ను చంపాలని చూశారు. 70 మంది తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. హత్యాయత్నానికి పాల్పడిన వైకాపా కార్యకర్తలను వదిలేశారు’’ అని పులివర్తి నాని ఆక్షేపించారు. కౌంటింగ్‌ సరిగా నిర్వహించేలా అధికారులు చూడాలని ఈ సందర్భంగా కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని